By: సవాల్‌రెడ్డి
రాష్ట్రంలో విద్యుత్ కోతలు, రైతుల కడగండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ టీటీడీపీ పార్టీలు యాత్రలు జరుపుతున్నాయి. నాలుగు నెలలు నిండీనిండని సర్కారే ఈ దుస్థితికి కారణమని ఆరోపిస్తున్నాయి. తమ హయాంలో రాష్ట్రమేదో విద్యుత్ మహావైభవాన్ని అనుభవించినట్టు..రైతులు ఆనందంతో పండుగల మీద పండుగలు చేసుకున్నట్టు ప్రచారాలు చేసుకుంటున్నాయి. తమ హయాంలో విద్యుత్ కోతలే లేనట్టు, ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడనట్టు చిత్రిస్తున్నారు. వాస్తవానికి రైతుల ఆత్మహత్యలకు ఏదో ఒక్క సమస్య మాత్రమే కారణం కాదు.
-ముందు చూపులు కాదు.. అంతా నేలచూపులే
-కల్తీలేని విత్తనాలు అరికట్టలేని సర్కార్లు మీవి
-మీ హయాంలోనే 18 వేల మంది రైతుల బలవన్మరణాలు
-రాజధానిలోనే 8 గంటల కోతలు మీ ఘనతే
-చలికాలం కోతలు పెట్టిన రికార్డు కూడా మీదే
-విత్తనాలు, ఎరువులకు క్యూ కట్టని సంవత్సరం ఉందా?
-కరెంటు బిల్లుల కోసం రైతులను జైళ్లకు పంపింది మీరుకేవలం ఒక్క విద్యుత్ కోత, ఒక్క పంట వైఫల్యం వల్ల మాత్రమే ఆత్మహత్యలు జరగవు. అనేకానేక సమస్యల ముట్టడి కారణంగానే ఎంతో ఒత్తిడికి గురైన తర్వాతే రైతులు బలవన్మరణాలకు పాల్పడతారని రైతు ఆత్మహత్యల మీద నియమించిన అనేక కమిటీలు స్పష్టం చేశాయి. వరుసగా పంట నష్టాలు రావడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విత్తనాల వైఫల్యం, వర్షాభావంతో పాటు గృహసంబంధ సమస్యలు, రుణభారం, ఆరోగ్య సమస్యలు అన్నీ కలగలిసి రైతును ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి.
ఈ రాష్ట్రంలో 1997 నుంచి 2009 వరకు దాదాపు 17వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే గత కాలపు ప్రభుత్వాల హయాంలో రైతు అనుభవించిన మహావైభవం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ముందు చూపులు.. వెనుక చూపులు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ హయాంలో తొమ్మిదేండ్లలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరెంటు బిల్లులు కట్టని రైతును జైలుకు పంపిన ఘనత చంద్రబాబుది. కరెంటు బిల్లులు పెంచి, విత్తనాలు ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతులకు ఆత్మహత్యల దారిచూపింది టీడీపీ సర్కారే.
కాంగ్రెస్ హయాం అంతకు తక్కువేం కాదు. రెండు పార్టీలు కలిసి 2009 నాటికే 17వేల మంది రైతుల ఉసురు పోసుకున్నాయి. 2000 నుంచి 2010 వరకు దశాబ్దకాలంలో రాష్ట్రంలో 22వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వ విభాగం ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) 2010 జూన్ మాసంలో ప్రకటించింది.
బాబు హయాంలోనే మొదలైన ఆత్మహత్యలు..: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర చోటుచేసుకున్నది 1997-98నుంచే. అపుడు రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఒక రైతు కండ్లముందే పంట మలమల మాడిపోవడం చూసి గుండె చెదిరి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తి విత్తనాల వైఫల్యం, వర్షాభావం, విద్యుత్ కోతలు దానికి కారణం. అపుడు మొదలైన ఆ ఆత్మహత్యల పరంపర చంద్రబాబు సర్కారు కొనసాగినంతకాలం కొనసాగుతూ వచ్చింది.
రైతులు తమ సమస్యలకు ఆత్మహత్యల్లో పరిష్కారం వెతుక్కునే ఆనవాయితీకి కారణం చంద్రబాబు పాలనే. కనీసం నకిలీ విత్తనాలు కూడా అరికట్టలేని ఆ సర్కారు వైఫల్యం కారణంగా వందల మంది రైతులు బలయ్యారు. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోగా వ్యవసాయం దండుగ అని ఆ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తే ఆత్మహత్యలకు ప్రోత్సహించినట్టు అవుతుందని కొత్త నిర్వచనం ఇచ్చింది కూడా చంద్రబాబే. ఆయన హయాంలోనే ప్రపంచబ్యాంకు ఆదేశాలతో విత్తనాలు ఎరువుల మీద సబ్సిడీలు క్రమంగా ఎత్తేశారు. ఫలితంగా వ్యవసాయం రైతుకు మోయలేని భారంగా మారింది. వారికి నాటి సర్కారు ఏ ఉపశమనం కల్పించలేదు.
1997 నుంచి 2004 వరకు 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారణం ఏమిటి? ఆయన బడ్జెట్ కేటాయింపులు చెప్పకనే చెప్తాయి. చంద్రబాబు అధికార వియోగానికి ఒక ఏడాది ముందు అంటే 2002-03 సంవత్సరంలో ప్లాన్ బడ్జెట్‌లో వ్యవసాయానికి ఇచ్చింది కేవలం 2.15 శాతం. ఆయన హయాంలో అత్యధికంగా ఇచ్చింది 4.80 శాతం మాత్రమే. ఇదిచాలు చంద్రబాబు రైతు ప్రేమ వివరించేందుకు.
అతని కంటె ఘనులు..: ఇక కాంగ్రెస్ హయాం.. రైతు రాజ్యం పేరిట 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హయాం రైతు ఆత్మహత్యల సంఖ్యలో టీడీపీని మించిపోయింది. అదనంగా పారిశ్రామికరంగానికి కూడా సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది. వారానికి సగం రోజులు విద్యుత్ హాలిడేలు అనధికారికంగా అమలు చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా 8 గంటలకుపైగా కరెంటు కోతలు విధించిన ఘనత కాంగ్రెస్‌దే. రాష్ట్రంలో చేనేత, జౌళి,నాపరాయి, ఫార్మా తదితర అన్ని రంగాల పరిశ్రమలు నెలల తరబడి విద్యుత్ కోతలతో సతమతమయ్యాయి.
అందులోనూ గత సంవత్సరం కనీవినీ ఎరుగని కరెంటు కోతలు రాష్ట్రం చవిచూసింది. ఏం చేయలేమని విద్యుత్ అధికారులు బహిరంగంగా చేతులెత్తేసిన స్థితి కూడా కాంగ్రెస్ హయాంలోనే నమోదైంది. ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి కూడా కరెంటు కోత ఎదురైన ఘనత కిరణ్‌కుమార్ రెడ్డి హయాం రికార్డు చేసుకుంది.
రైతు బలవన్మరణాలకు కారణాలు..
తెలంగాణలో పేదరికం, నీటి వనరుల వసతి లేకపోవడం వల్లనే నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఈ ప్రాంతంలోనే ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. చిన్న, సన్నకారు రైతులు, కౌలుదారులకు ప్రభుత్వ రుణాలు లభించక వడ్డీ వ్యాపారుల మీద ఆధార పడడం, పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం, విత్తనాలు, ఎరువుల ధరలు భారంగా మారడం, భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లలో నీరు పడక పోవడం, నకిలీ విత్తనాలు, బీటీ విత్తనాల వైఫల్యం, వర్షాభావం, నూతన ఆర్థిక విధానాలు అన్నీ రైతుకు ఉరితాళ్లు పేనాయి.
ముఖ్యంగా 1997 నుంచి క్రమంగా విద్యుత్ చార్టీలు పెరిగి తడిసి మోపెడు కావడం, విత్తనాలు, ఎరువుల మీద సబ్సిడీలు ఎత్తివేయడంతో మొత్తంగా వ్యవసాయం మీద వ్యయం 50 శాతానికి పైగా పెరిగింది. ఇందులో విద్యుత్ వాటా 20 శాతం. ముఖ్యంగా 1990-2003 మధ్య వ్యవసాయం మీద ప్రభుత్వ పెట్టుబడులు భారీగా పడిపోయాయి. చెరువుల మరమ్మతులు, కాల్వల నిర్వహణ పడిపోయింది. నూతన ప్రాజెక్టుల మీద పెట్టుబడులు ఆగిపోయాయి. విద్యుత్ బిల్లులు కట్టక ఎత్తిపోతల పథకాలు ఆగిపోయాయి.
నష్ట పరిహారానికి ఇంత తతంగం..
రైతు ఆత్మహత్యకు నష్టపరిహారం కావాలంటే సర్కారు నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్‌నుంచే ఐదు రకాల ధృవీకరణ పత్రాలు అవసరం. 1. ఎఫ్‌ఐఆర్ 2. పంచనామా నివేదిక 3 పోస్టుమార్టం నివేదిక 4 ఫోరెన్సిక్ లాబ్ నివేదిక 5. తుది పోలీస్ నివేదిక. ఇంకా కావల్సిన ఇతర నివేదికల్లో ప్రభుత్వ బ్యాంకు లేక ప్రైవేటు రుణాలకు సంబంధించిన డాక్యుమెంటు, పట్టా పాస్‌పుస్తకం, ఆధారపడిన వారి ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, మూడు సంవత్సరాల పహాణి. వీటితో పాటు మండల స్థాయి, డివిజనల్ స్థాయి వెరిఫికేషన్ కావాలి… ఇంత తతంగం పూర్తి చేస్తే కానీ రైతు బలవన్మరణానికి నష్ట పరిహారం రాదు.
మచ్చుతునకలివి…
-2009లో తీవ్ర కరువుకు తోడు విద్యుత్ కోతలతో రైతులు అల్లాడారు. వ్యవసాయ రంగం సంక్షోభం పుట్టిన శిశువులపై కూడా ప్రభావం చూపింది. నల్లగొండ జిల్లాలోని గిరిజన తండాల్లో అపుడే పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో వదిలేసి పోయిన అమానవీయ సంఘటనలు పత్రికలకెక్కాయి.
-2010లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన విద్యుత్ సంక్షోభం పారిశ్రామికరంగం వ్యవసాయరంగం మధ్య సిగపట్లకు దారి తీసింది. ప్రభుత్వం వారానికి మూడురోజులు పరిశ్రమలకు హాలిడే ప్రకటించి వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ సర్దుబాటు చేయడంతో పరిశ్రమ యజమానులు సర్కారు విధానాలను దుమ్మెత్తి పోశారు. వేలాది మంది కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తే విద్యుత్‌కోతల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయక్షేత్రంలో మొక్కలకు బిందెల్లో నీళ్లు తెచ్చి తడుపుకున్నారు. గ్రామాలకు బండ్లమీద నీళ్లు తెచ్చుకున్న దృశ్యాలు కనిపించాయి.
– 2011లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగింది. జనవరి నుంచి నవంబర్‌లోగా 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అసలైన బలవన్మరణాల సంఖ్య 65 మాత్రమేనని సమర్థించుకుంది. అసెంబ్లీలో ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని దుమ్మెత్తి పోసుకున్నారు.
-ఇక 2012లో అయితే చలికాలంలో కూడా విద్యుత్ కోతలు విధించారు. పరిశ్రమలు తీవ్ర కోతలను ఎదుర్కున్నాయి. రికార్డు స్థాయిలో పరిశ్రమలకు 70శాతం కోతలు ఎదుర్కుంటున్నామని ఆ సంవత్సరం సెప్టెంబర్‌లో పారిశ్రామిక వర్గాలు పత్రికా ముఖంగా వెల్లడించారు. ఫలితంగా వేలకొద్ది పరిశ్రమలు మూతపడ్డాయి.
సీఎం సొంత జిల్లాలో పరిశ్రమలు లాకౌట్ ప్రకటించాయి. దీనితో పరిశ్రమలు నేరుగా విద్యుత్ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి పోన్నాల మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో 14శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిపోయిందని వాపోయారు . మెదక్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పారిశ్రామికవాడల్లో వేలాది చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఫార్మారంగం మీద తీవ్ర ప్రభావం పడింది. లక్షల సంఖ్యలో కార్మికులు వీధిన పడ్డారు. రోజుకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లింది. తమ గోడు చెప్పుకోవడానికి సీఎంతో పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసుకున్న సమావేశం జరుగుతుండగానే కరెంటు పోయి సర్కారు పరువు తీసింది. నెలల తరబడి ఈ పరిస్థితి నెలకొంది. రైతుల పిల్లలు స్కూళ్లు మానేసి బాలకార్మికులుగా మారిన వార్తలు వచ్చాయి.
-2013లో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెదక్ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 384 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కరెంటు కోతలు, వర్షాభావం ప్రధాన కారణాలు. ఈ మరణాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సంవత్సరం నవంబర్ నెలలో హైదరాబాద్ నగరంలో కనీవినీ ఎరుగని విద్యుత్ కోతలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 8 గంటల ఏకధాటి కోతలు విధించారు. అందులో నీలోఫర్ ఆస్పత్రి కూడా ఉంది.
-పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. 70 శాతం కోతలు విధిస్తున్నారని అనధికారికంగా నెలకు సగం రోజులు పవర్ హాలిడే పాటిస్తున్నారని పరిశ్రమల యజమానులు ప్రభుత్వం మీద నేరుగా ధ్వజమెత్తారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..