వచ్చే మూడేళ్ళలో తెలంగాణ రాష్ట్రం హరిత వనం కావాలని, పదికోట్ల మొక్కలు నాటి హైదరాబాద్ ను పచ్చటి వనంగా మార్చాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అటవీశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ పరిధిలో రానున్న మూడేళ్ళలో పది కోట్ల మొక్కలు నాటాలని, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఏడాది 3.30కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ప్రతి నియోజకవర్గానికి 40లక్షలు, ప్రతి గ్రామానికి 33 వేల మొక్కలు నాటాలని చెప్పారు. రోజు రోజుకూ క్షీణిస్తున్న అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని, అలంకార ప్రాయంగా ఉండే మొక్కలు కాకుండా ఉపయోగపడే రావి, వేప, పొగడ, మర్రి, చింత చెట్లను నాటాలని అన్నారు. సింగపూర్ తరహాలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నగరంలో చేపట్టాలని, చెరువుగట్ల పైన, నదుల ఒడ్డున మొక్కలు విరివిగా పెంచాలని, ప్రతి ఫ్యాక్టరీలో, కార్యాలయాల్లో ఎక్కడ చూసినా చెట్లు ఉండాలని, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో ఖచ్చితంగా పచ్చదనం కనిపించాలని స్పష్టం చేశారు.