దేశంలో ప్రముఖ నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. కోవిడ్ సెకండ్‌వేవ్ తర్వాత కార్పొరేట్ల నుంచి డిమాండ్ పెరగడంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ మార్కెట్ లీడర్‌గా ఆవిర్భవించిందని అమెరికాకు చెందిన మార్కెటింగ్ సంస్థ కొలియర్స్ తెలిపింది. హైదరాబాద్ నగరంలో జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. దీంతో ఈ విభాగంలో హైదరాబాద్… బెంగళూరును అధిగమించిందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. కాగా గతేడాది హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ 19 లక్షల చదరపు అడుగులు ఉంటె ఈ ఏడాది అనూహ్యంగా 6 లక్షల చదరపు అడుగులకు పెరిగి 25 లక్షల చదరపు అడుగులకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు స్థాపించేందుకు అన్ని రకాల అనుమతులు త్వరితగతిన ఇస్తూ అనుకూల వాతావరణాన్ని ఏర్పరచడం వల్లే హైదరాబాద్ లో తమ ఆఫీసులు నెలకొల్పేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని రమేష్ నాయర్ అంచనా వేశారు.
2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఊపందుకుందని, వర్క్‌స్పేస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా పెద్ద పెద్ద లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులు క్రమేపీ ఆఫీసులకు వస్తుండటంతో స్పేస్ లీజింగ్‌లో నిర్ణయాలు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. కొవిడ్ మూడోవేవ్ లేకపోతే రానున్న త్రైమాసికాల్లో లీజింగ్ మరింత ఊపందుకుంటుందన్నారు. 2021 సెప్టెంబర్ క్వార్టర్లో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ గ్రాస్ లీజింగ్ 34 శాతం వృద్ధితో 103 లక్షల చదరపు అడుగులకు చేరింది. 2020 సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 77 లక్షల చదరపు అడుగులు మాత్రమే.
ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ 25 లక్షల చదరపు అడుగులకు పెరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 21 లక్షల చదరపు అడుగులతో ద్వితీయ స్థానంలో ఉంది. గతేడాది ఇదేకాలంలో బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25 లక్షల చదరపు అడుగులు ఉండగా ఈ ఏడాది 4 లక్షల చదరపు అడుగులు తగ్గి ద్వితీయస్థానానికి పడిపోయింది. ఇక 17 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ తో పూణె తృతీయ స్థానంలో నిలిస్తే.. 15 లక్షల చదరపు అడుగులతో ఢిల్లీ నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.13 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ తో చెన్నై ఐదవ స్థానంలో ఉంటే.. ముంబై మాత్రం 14 లక్షల నుండి 12 లక్షల చదరపు అడుగులు తగ్గి ఆరవ స్థానంలో నిలిచింది.