అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదని, కావాలని వివక్ష చూపిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోకుండా… ఢిఫెన్స్ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రూ.1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.. ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పారు. దేశ రక్షణ రంగంలో హైదరాబాద్‌లోని రక్షణ పరిశ్రమలది కీలకపాత్ర అని చెప్పారు. వెమ్ టెక్నాలజీలో సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.