హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ముఖ్య స్థానంలో నిలబెడతామని, ఒకప్పుడు ఢిల్లీ కన్నా పెద్ద నగరమైన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని సీఎం స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో 75వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ జరిగే స్థలానికి నాలుగు రోజుల్లో పట్టా ఇస్తామని, నిస్వార్ధంగా పని చేస్తున్న నుమాయిష్ సంస్థకు నిజాం రాజులు స్థలాన్ని ఇస్తే దానిని గత ప్రభుత్వాలు లీజుకు ఇవ్వడం సిగ్గుచేటని, నుమాయిష్ లీజుదారు కాదని, హక్కుదారేనని కేసీఆర్ తేల్చిచెప్పారు.
ఎగ్జిబిషన్ జరిగే మైదానాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే బాగా తీర్చిదిద్దాలని, ఇప్పుడున్న స్థలంలో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఖాళీ స్థలం మొత్తం ఎగ్జిబిషన్ కే వినియోగించాలని సీఎం చెప్పారు. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ సమస్య భయంకరంగా ఉందని, ట్రాఫిక్ సమస్య కోసం డల్లాస్ నగరం మాదిరిగా ప్రణాళికలు సిద్ధం చేశామని, సిగ్నళ్లు లేని చౌరస్తాలు లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, మంత్రులొక్కరే ఏమీ చేయలేరని, ఏదైనా సాధించాలంటే కలిసికట్టుగా ఉండాలని, తెలంగాణ సమాజం అట్లా కృషి చేస్తేనే రాష్ట్రం వచ్చిందని అన్నారు. జంటనగరాల ప్రజలతో త్వరలో టీవీల ద్వారా ముఖాముఖి కార్యక్రమం ద్వారా చర్చించి అభిప్రాయాలు సేకరిస్తానని సీఎం పేర్కొన్నారు.