mt_logo

వార్ రూమ్ భేటీలో వాడి వేడిగా చర్చ

మంగళవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ఎంపీలతో కాంగ్రెస్ అదిష్టాన పెద్దలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ సోమవారం వార్ రూమ్ లో భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించి తీరాలని, పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని ఎంపీలకు తేల్చిచెప్పింది. బిల్లును ప్రవేశపెట్టడంలో వెనక్కు తగ్గేది లేదని, విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం ఉండబోదని దిగ్విజయ్ స్పష్టం చేశారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలు పార్లమెంటులో కూడా అనుకూలంగా ఓటింగ్ వేస్తాయని, కేంద్ర ప్రభుత్వానికి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పినట్లు సమాచారం. ఒకానొక సందర్భంలో కేంద్ర మంత్రి కావూరికి, సీమాంధ్ర ఎంపీలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్లు, విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు తమతో రాకపోతే ప్రజాగ్రహాన్ని చూడాల్సి వస్తుందని సీమాంధ్ర ఎంపీలు అన్నట్లు తెలిసింది. సమావేశం అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సహకరించాల్సిందిగా సీమాంధ్ర ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించేదిలేదని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడం మంచిది కాదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలం డివిజన్ తెలంగాణ లోనే ఉంటుందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్పారు. విభజన అనివార్యమైతే రెండు ప్రాంతాల సమస్యల పరిష్కారాలకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *