గతంలో చాలీచాలని వేతనంతో భారంగా బతుకు వెళ్ళదీస్తున్న హోంగార్డులకు తెలంగాణ సర్కారు మంచి కబురు అందించింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ. 300 నుండి రూ. 400 కు పెంచుతూ రాష్ట్ర హోం శాఖ ప్రభుత్వ కార్యదర్శి బీ వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హోంగార్డుల నెలవారీ వేతనం రూ. 9000 నుండి రూ. 12000 కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ప్రభుత్వ కార్యదర్శి బీ వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా డీజీపీ అనురాగ్ శర్మ ప్రతిపాదన మేరకు హోంగార్డులకు ఏటా ఇస్తున్న ఒక యూనిఫాం అలవెన్స్ ను రెట్టింపు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా వారికి చెల్లిస్తున్న పరేడ్ అలవెన్స్ ను రూ. 28 నుండి రూ. 100 కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పోలీసు శాఖ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జీవో జారీ చేయడంతో హోంగార్డులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, పోలీస్ సిబ్బంది సమస్యలతో పాటు తమ సమస్యలపై కూడా పోరాడుతున్న పోలీస్ అధికారుల సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి మాట్లాడుతూ, హోంగార్డుల జీతభత్యాలు పెంచి సంక్షేమ ప్రభుత్వమని సీఎం మరోసారి నిరూపించారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.