mt_logo

అమెరికాలో హెల్ప్ లైన్ ఏర్పాటుచేసిన ‘ఆటా తెలంగాణ’

వీసా గడువు ముగిసినా దాదాపు ఆరువందలమంది అమెరికాలో నివసించేందుకు సహకరించిన ఎనిమిది మంది తెలుగు విద్యార్ధులను మిచిగాన్ పోలీసులు మంగళ, బుధవారాల్లో అరెస్ట్ చేశారు. స్వయంగా అమెరికా ప్రభుత్వమే నకిలీ యూనివర్సిటీ నెలకొల్పి నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ లో ‘పే టు స్టే’ కుంభకోణం బట్టబయలయింది. ఆరుగురిని డెట్రాయిట్ లో, ఇద్దరిని వర్జీనియా, ఫ్లోరిడాలో అరెస్ట్ చేశారు. అక్రమ అడ్మిషన్లు పొందినవారిని సైతం భారీగా అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు వారిని వెనక్కు పంపే ప్రక్రియ(డిపోర్టేషన్) చేపట్టారు. ఈ ఘటనలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నట్లు సమాచారం.

దేశం కాని దేశంలో ఉన్నట్లుండి వచ్చిపడిన ఆపదతో తెలుగు విద్యార్ధులు విలవిల్లాడుతున్నారు. వీరికి న్యాయపరమైన సహాయం అందించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ముందుకొచ్చాయి. ఆటా, ఆటా తెలంగాణ బృందాలు వివిధ యూనివర్సిటీల్లో చదివే విద్యార్ధులను కలిశాయి. ఈ క్రమంలో అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ శింగ్లా, కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణిలతో ‘ఆటా’ ప్రతినిధులు అట్లాంటాలో సమావేశమయ్యారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత రాయబార కార్యాలయానికి సంపూర్ణ మద్దతు అందిస్తామని ఆటా చీఫ్ పరమేష్ భీంరెడ్డి తెలిపారు. అంతేకాకుండా బాధిత విద్యార్ధులను రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆటా తన ఫేస్ బుక్ పేజీలో వివరించింది. అమెరికాలో నకిలీ ఏజంట్లతో అప్రమత్తంగా ఉండాలని భారతీయులను కోరింది.

ఈ నేపధ్యంలో బాధిత విద్యార్ధులకు సహాయపడేందుకు అమెరికా తెలంగాణ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటుచేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల తెలిపారు. న్యాయపరమైన సహాయ, సహకారాలు అందించేందుకు సంస్థ తరపున అటార్నీలను(న్యాయవాదులను) ఏర్పాటుచేశామని, తమంతట తామే సొంత దేశానికి వెళ్ళిపోతే చదువుకునేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. బాధితులు అమెరికా తెలంగాణ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఉన్న హెల్ప్ లైన్ లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *