mt_logo

వరంగల్‌లో ఆరోగ్యవర్సిటీ

-కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఏర్పాటు
-ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం.. జిల్లా ప్రజల హర్షాతిరేకాలు
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఆరోగ్యవర్సిటీ ఏర్పాటుకానుంది. దీనిని వరంగల్‌లో విశ్వకవి కాళోజీ నారాయణరావు పేరిట నెలకొల్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వైద్య విద్యకు సంబంధించి భావి డాక్టర్ల ఎంపిక మొదలు.. ప్రతి చిన్న విషయానికి బెజవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పరుగెత్తకుండా మన రాష్ట్రంలోనే వైద్య విశ్వ విద్యాలయం ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ విశ్వవిద్యాలయానికి కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా నామకరణం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నర్సింగ్, న్యాచురోపతి అండ్ యోగా, ఐప్లెడ్ న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విభాగాలన్నీ ఈ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. తెలంగాణలోని పది జిల్లాల్లో ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలు దీని పరిధిలోకి రాగా… కొత్త ఏర్పాటయ్యే వాటికి అనుమతులు, పాత వాటికి రెన్యువల్ ఇబ్బందులు ఇక ఉండవు. నర్సింగ్, పారామెడికల్ కాలేజీల రిజిస్ట్రేషన్లు సులభతరం కానున్నాయి. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు, కౌన్సిలింగ్‌లో ఇప్పటివరకు తెలంగాణ విద్యార్థులకు జరిగిన అన్యాయాలు, ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

మరోవైపు తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్ వైద్య విద్యకు కేంద్రంగా మారనుంది. వరంగల్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమయ్యే వనరులు, అనుమతులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం తాజాగా మంజూరుకు పచ్చజెండా ఊపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్టంగానీ, అర్డినెన్స్‌ద్వారాగానీ ఏర్పాటుకు అధికారిక ఆమోద ముద్ర వేయనుంది. 2015-16 విద్యా సంవత్సరానికి దీనిని అందుబాటులోకి తెచ్చేదిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయం తెలంగాణకే తలమానికంగా మారనుంది.

ప్రభుత్వ నిర్ణయంతో ఎంజీఎం దవాఖాన సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చెందనుంది. 163ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ఉండటం వల్లనే హెల్త్‌యూనివర్సిటీకి ఇదే అనువైన ప్రాంతమని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మరింత స్థలం అవసరమైతే కేఎంసీని ఆనుకుని ఉన్న సెంట్రల్‌జైలును వేరే ప్రాంతానికి తరలించి దాంట్లో యూనివర్సిటీకి సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

వరంగల్‌లో హెల్త్‌యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఓరుగల్లు పులకరించిపోయింది. విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరును ఎంచుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాళోజీ భావజాలాన్ని ఎల్లకాలం నిలిపి ఉంచడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాళోజీ శతజయంతి వేడుకల సందర్భంగా కాళోజీని విశ్వకవిగా సీఎం అభివర్ణించారు. కాళోజీ పార్థివదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అందజేశారు. అప్పుడు కొందరు కేఎంసీకి కాళోజీ పేరు పెట్టాలన్న ప్రతిపాదన కూడా చేశారు. కానీ, ఇవాళ ఏకంగా కాళోజీ పేరుమీదనే యూనివర్సిటీని అదీ వరంగల్‌లో ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

వరంగల్ జిల్లాకు దక్కిన గౌరవం
ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్సిటీని మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వరంగల్‌కు వచ్చినప్పుడు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు కాళోజీపేర యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్తగా యూనివర్సిటీకి తప్పనిసరిగా కాళోజీ పేరు పెడుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ నిర్ణయం వరంగల్ జిల్లాకు దక్కిన గౌరవంగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందరావు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద సంబురాలను చేసుకున్నారు. అలంకార్ జంక్షన్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చుతూ సంబురాల్లో భాగస్వామి అయ్యారు.

నోట మాట రావడంలేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు అడుగకుండానే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎంను చేశారు. ఇప్పడు వరంగల్‌కు హెల్త్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రియే ప్రకటించడంతో నాకు నోట మాట రావడంలేదు. వరంగల్‌కు మంచిరోజులు వచ్చాయి. హైదరాబాద్ సరసన వరంగల్‌ను ముఖ్యమంత్రి నిలబెడుతారు.
– డాక్టర్ తాటికొండ రాజయ్య, డిప్యూటీ సీఎం

కాళోజీకి దక్కిన గౌరవం..
జిల్లాలో హెల్త్ వర్సిటీని ఏర్పాటు చేయడం వరంగల్ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. కొత్తగా ఏర్పాటు చేసే హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినందుకు జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేసీఆర్‌ను జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు.
– కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ

వరంగల్ జిల్లాకు పెద్దపీట..
జిల్లాకు ముఖ్యమంత్రి పెద్ద పీటవేస్తున్నారు. జిల్లాలో ఒకప్పుడు కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు 400 గజాల స్థలం కోసం సీమాంధ్ర ప్రభుత్వాన్ని పదేండ్లు అడిగినా ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం మూడున్నర ఎకరాల భూమిని కేటాయించింది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న వర్సిటీకి కాళోజీ పేరు పెట్టినందుకు.. కేసీఆర్‌కు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు.
– దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *