గత రెండు రోజులుగా హస్తినలో మకాం వేసిన టీజేఏసీ నేతలు జాతీయ పార్టీల నేతలను కలిసి తెలంగాణ బిల్లుకు మద్ధతు కూడగడుతూ, పనిలోపనిగా రాయల తెలంగాణకు ఒప్పుకోవద్దని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ డిల్లీలోని బాపూ ఘాట్ వద్ద జేఏసీ నేతలు మౌన దీక్ష కూడా చేశారు.
60 ఏళ్ళ తెలంగాణ పోరాటాన్ని, 1100మందికిపైగా వ్యక్తుల ప్రాణత్యాగాలు పట్టించుకోకుండా కేంద్రప్రభుత్వం తీసుకోబోతున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎదుర్కొనే శక్తినివ్వాలని మహాత్మాగాంధీని ప్రార్థించామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. మహాత్మాగాంధీ బాటలో తెలంగాణ ఉద్యమం నడుస్తుందన్నారు. తెలంగాణ యువతీ, యువకులు వారి ప్రాణాలను బలిచేసుకున్నారు తప్పించి ఎవరినీ హింసించలేదన్నారు. కేంద్రం ఇష్టం వచ్చినట్లు వెళితే మరో పోరాటముంటుందని, అది గతంకంటే ఉధృతంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తనను కలిసిన జేఏసీ నేతలతో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణను అడ్డుకోవడానికే రోజుకొక ప్రతిపాదనను తెస్తుందని చెప్పారు. పార్లమెంటులో రాయల తెలంగాణ ప్రతిపాదనను అడ్డుకుంటామని తెలిపారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప వేరే దేనికీ తాము ఒప్పుకోబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా టీజేఏసీకి స్పష్టం చేశారు.
కోదండరాం నాయకత్వంలో టీజేఏసీ నేతలు జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ ను ఆయన నివాసంలో ఆయనను కలిశారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని శరద్‌యాదవ్ స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో సహా పలువురు ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలను కలుస్తామని కోదండరాం తెలిపారు.