mt_logo

రాయల తెలంగాణ – తెలంగాణ మెడలో లొటారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ బిల్లు తయారీ చివరి దశకు చేరుకున్న వేళ ఒక్కసారిగా రాయల తెలంగాణ ప్రతిపాదన రంగం మీదకి వచ్చింది. గతంలో కూడా ఈ ప్రతిపాడన వచ్చినప్పటికి తెలంగాణలో వ్యక్తమైనా తీవ్ర వ్యతిరేకత కారణంగా కనుమరుగైపోయింది. ఈ సారి మాత్రం చాప కింద నీరు లాగా కుట్ర పూరితంగా రంగం మీదకు తెచ్చినారు. ఇటు తెలంగాణలో అటు రాయలసీమలో గగ్గోలు మొదలైంది. ఎవరి ప్రయోజనాలకోసం ఈ ప్రజా వ్యతిరేక ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు? ఎవరు కుట్రదారులు ? సి డబ్ల్యూ సి తీర్మానంలో లేని అంశం , జి ఓ ఏం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేని అంశం , గత మూడు నెలలుగా జి ఓ ఏం జరుపుతున్న సంప్రతింపుల్లో రాని అంశం బిల్లు రూపొందుతున్న చివరి దశలో రంగం మీదకి రావడం అందరిని ఆశ్చర్యంలో పడవేసింది. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక ఉన్న లక్ష్యాలను , కుట్రదారుల ప్రయోజనాలను విశ్లేషించుకోవాలి.

కర్నూల్ ని రాజధాని రేస్ నుండి తప్పించడం – రాయలసీమ అస్తిత్వాన్ని ఖతమ్ చెయ్యడం :

తెలంగాణ విభజన జరిగిన తర్వాత సీమాంధ్రకు రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేయాలన్నది తెలంగాణ విభజన కన్నా జఠిలమైన సమస్య. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మా రాజధాని మాకే కావాలి అని రాయలసీమ నుండి డిమాండ్ వస్తున్నది. అంటే కర్నూల్ ని సీమాంధ్రకు రాజధానిగా ప్రకటించాలన్నది వారి డిమాండ్. అది సహజము . న్యాయం కూడా. అయితే తీరాంధ్ర సంపన్న, ఆధిపత్య వర్గాలకు కర్నూల్ ని రాజధానిగా చేయడం ఇష్టం లేదు. వారికి తీరాంధ్రలోనే అంటే విజయవాడ – గుంటూరు లోనే ఏర్పాటు చేసుకోవాలని ఆశ పడుతున్నారు. భవిష్యత్తులో రాయలసీమ రాష్ట్రం డిమాండ్ ఊపందుకొని రాయలసీమ వేరుపడే పరిస్తితి వస్తే మళ్ళీ రాజధాని నగరాన్ని కోల్పోవాల్సివస్తుంది. అందువల్ల దూర దృష్టితో ఆలోచించి రాయల తెలంగాణ ప్రతిపాదనని ముందుకు తెప్పించడంలో తీరాంధ్ర నాయకత్వపు లాబీయింగ్ సఫలమైందనే చేప్పాలి. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి కర్నూల్ ని రాజధాని రేస్ నుండి తప్పించడం. రేండోది భవిష్యత్తులో రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలపడకుండా రాయలసీమ అస్తిత్వాన్ని ఖతం చేయ్యడం. ఈ ఎపిసోడ్ లో రాయలసీమ నాయకత్వం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రఘువీరా రేడ్డీ లాంటివారు భాగస్వాములు కావడమే విషాదం. వందల ఏళ్ళ ఉమ్మడి సహజీవనాన్ని , అస్తిత్వ చరిత్రను విస్మరించి వర్తమాన రాజకీయ , ఆర్టిక ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజలను విభజించడానికి తీరాంధ్ర సంపన్నవర్గాల కుట్రలకు సహకరించాలనుకోడం జాతి ద్రోహం కింద పరిగణించాల్సి ఉంటుంది. తీరాంధ్రతో కలవడం వారికి ఇష్టంలేని పక్షంలో వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలే తప్ప జాతిని చీల్చే చర్యకు ఉపక్రమించడం సమంజసంకాడు. అందుకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడం :

తెలంగాణ ఉద్యమంలో సంఘఠితమై రాజకీయంగా ఎదిగివస్తున్న బి సి ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకత్వాన్ని రాజకీయంగా ఎదగనివ్వకుండా తెలంగాణలో ఆధిపత్యాన్ని నెరపుతున్న ఆగ్రకుల సామాజిక వర్గాలు రాయలసీమ ఆధిపత్య కులాలతో కుమ్ముక్కై ఈ రాయాల తెలంగాణ ప్రతిపాదనని ముందుకు తెచ్చారన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. అదే నిజమైతే సామాజిక న్యాయంకోసం ఉద్యమిస్తున్న సబ్బండ వర్గాల , కులాల ఆశలు అడియాసలు అవుతాయి. తెలంగాణలోనూ ఆధిపత్య కులాలే తిరిగి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని గండికొట్టే రాయల తెలంగాణ ప్రతిపాదనని తెలంగాణ ప్రజలందరూ తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది.

దోపిడినీ కొనసాగించుకోవడం :

కర్నూల్ , అనంతపురం ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు శ్రీశైలం నీటి దోపిడీతో , హైదరాబాద్ లో తమ ఆధిపత్యాన్ని నిరాఘాటంగా కొనసాగించుకోవడానికే అన్నది అందరూ గుర్తించవలసి ఉన్నది. రాయాల తెలంగాణ వెనుక కుట్ర ఏమిటో , కుట్రదారులు ఎవరో విశ్లేషించుకోవలసిన అవసరం ఎటు తెలంగాణ ప్రజలకు , అటు రాయలసీమ ప్రజలకు ఉన్నది.

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు :

రాయల తెలంగాణతో టి ఆర్ ఎస్ ప్రాభల్యాన్ని తెలంగాణలో, చంద్రబాబు , జగన్ , కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రాబల్యాన్ని రాయలసీమలో తీరాంధ్రలో తగ్గించడానికి కేంద్రం ఈ ఎత్తుగడని వేసిందా అన్నది మరో ప్రశ్న. అదే నిజమైతే అదొక మూర్కపు ఎత్తుగడగా , ఆత్మహత్యాసదృశమైన ఎత్తుగడగా చెప్పడానికి సందేహించనవసరం లేదు. సోనియాగాంధీ సలహాదారులు తప్పులో కాలేసినట్లే. రాయల తెలంగాణ ఏర్పడితే టి ఆర్ ఎస్ ప్రాబల్యం పెరుగుతుందే తప్ప తగ్గదు. 10 జిల్లాలతో , భద్రాచలం , మునగాల సహా , ఆంక్షలు లేని హైదారాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే తెలంగాణలో టి ఆర్ ఎస్ అప్రతిహాత విజయాన్ని భూమ్మీది ఏ శక్తీ అడ్డుకోజాలదు. టి ఆర్ ఎస్ ప్రజల్లోకి వెళ్ళి 10 జిల్లాల తెలంగాణ అడిగితే గుదిబండలని మెడలో వేసి తెలంగాణ ఇచ్చిందని కాంగ్రేస్ మోసాన్ని ఎండగడుతూ ప్రచారం సాగిస్తుంది. గుదిబండలను వదిలించుకునేందుకు కాంగ్రెస్ ఓడించాలని పిలుపునిస్తుంది. ప్రజలు కోరని తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రేస్ ను ఒడిస్తారు. టి ఆర్ ఎస్ కు పట్టం కడతారు. ఇకపోతే అటు రాయలసీమలో జగన్ రాయలసీమను విభజించినందుకు వ్యతిరేకంగా సీమ ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టి కాంగ్రెస్ ను మట్టిగరిపిస్తాడు. తీరాంద్రలో కూడా రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రేస్ మీద ఆగ్రహం వ్యక్తం కాక తప్పదు. కాబట్టి కాంగ్రేస్ రెంటికి చెడ్డ రేవడి కాక తప్పదు. 10 జిల్లాల తెలంగాణ ఇస్తే కనీసం తెలంగాణలో నైనా బతికి బట్టకట్టే అవకాశం ఉంటుంది.

రాయల తెలంగాణ కాంగ్రేస్ వినాశనానికి రోడ్ మ్యాప్ :

రాయల తెలంగాణ ప్రతిపాదన వలన చెరి 147 అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి , అప్పుడు అసెంబ్లీలో తీర్మానం నెగ్గుతుంది అన్న భావన కేంద్రానికి ఉన్నట్టు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ప్రతిపాదనని తెలంగాణలో అన్నీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. టి ఆర్ ఎస్ , బి జె పి , సి పి ఐ , వై సి పి శాసన సభ్యులు వ్యతిరేకిస్తారు. తెలంగాణ తెలుగు దేశం , కొంతమంది కాంగ్రేస్ శాసన సభ్యులు వ్యతిరేకిస్తారు. రాయలసీమలోని మెజారిటీ శాసన సభ్యులు వ్యతిరేకించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. మరి అసెంబ్లీలో తీర్మానం ఎట్లా నెగ్గుతుందో కాంగ్రేస్ మేధావులకే తెలియాలి. రాయల తెలంగాణ ప్రతిపాదన ఏ రాజకీయ ప్రయోజనాలకోసం ముందుకు తెచ్చారో అవేవీ నెరవేరే అవకాశం లేనే లేదు. పైగా కాంగ్రేస్ ను రెండు ప్రాంతాలలో భూస్థాపితం చేయడం ఖాయం. తెలంగాణ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారు చేయవలసిన జి ఓ ఏం కాంగ్రేస్ వినాశనానికి రోడ్ మ్యాప్ తయారు చేసినట్లుగా అనిపిస్తున్నది అని సి హెచ్ హనుమంతరావు గారు ఏకనామిక్ టైమ్స్ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో అభిప్రాయపడినారు.

తెలంగాణ మెడలో లోటారం :

ఏది ఎట్లున్నా రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణకు గుదిబండలాంటిది. గొడ్లకు కట్టే లోటారం లాంటిది. సజావుగా ముందుకు నడవనివ్వదు. కృష్ణా ఆక్రమ ప్రాజెక్టులు , ముఖ్యంగా పోతిరెడ్డిపాడు సక్రమమై పోతాయి. తెలంగాణ వస్తే తమకు న్యాయంగా అందవలసిన కృష్ణా నీళ్ళు అందుతాయనుకుంటున్న మహబూబ్ నగర్ , నల్లగొండ జిల్లా వాసుల ఆశలు వమ్ము అవుతాయి. రంగారెడ్డి జిల్లా , గ్రేటర్ హైదారాబాద్ రాయలసీమ ల్యాండ్ మాఫియా చేతుల్లో బందీగా ఉండిపోవాల్సి వస్తుంది. రాయలసీమలో పాతుకుపోయిన ఫ్యాక్షనిజం మహబూబ్ నగర్ కు , అటునుంచి హైదారాబాద్ కు పాకి తెలంగాణను కబళిస్తుంది. సజాతీయంగా ఉండవలసిన తెలంగాణ ద్విజాతి సమాజంగా మారుతుంది. మేజారిటీ మైనారిటీ ( ప్రాంత పరమైన ) ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. సీమాంధ్ర దోపిడీ వర్గాలు అంటూ ఇప్పటి దాకా దుమ్మెత్తిపోసిన వారితోనే సహజీవనం చేయవలసి దుస్థితి వస్తుంది.

ప్రజా ఉద్యమమే శరణ్యం :

రాయల తెలంగాణ భావన పట్ల మనలో కొందరికైనా సానుకూలత ఉన్నట్లు కనబడుతున్నది. ఏదో ఒక తెలంగాణ ఏర్పడనివ్వండి అంటున్నారు. ఏదో ఒక తెలంగాణ ఎందుకు ? మనం కోరుకున్న తెలంగాణ ఏర్పడాలి. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదా అని ఒక మిత్రుడు ఆవేదన వ్యక్తం చేసినాడు. ఆ మిత్రుని ఆవేదన సమస్త తెలంగాణ ప్రజలది. హైదారాబాద్ రాజధానిగా 10 జిల్లాల , 17 లోకసభ , 119 అసెంబ్లీ నియోజక వర్గాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంపై ఏ రాజీకి నాయకత్వం పాల్పడినా అది తెలంగాణ ద్రోహం కిందనే పరిగణించాలీ. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం రాయల తెలంగాణ ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమించవలసి ఉన్నది. రాయలసీమ ప్రజలు కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సి ఉన్నది.

******

శ్రీధర్ రావు దేశ్ పాండే
అధ్యక్షుడు ,
తెలంగాణ విద్యావంతుల వేదిక , గ్రేటర్ హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *