హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు జోగురామన్న, ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాకాల చెరువులో స్పీడ్ బోటును, పాకాల చెరువు దగ్గర 5 వేల ఎకరాల్లో 50 వేల సీతాఫలం మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో హరితహారం ఊపందుకుందని, నర్సంపేట స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు. హరితహారం నిరంతర కార్యక్రమమని, అడవులు ఉన్న చోటే వర్షాలు పడ్డాయి. అడవులు పెంచేందుకు అందరూ సహకరించాలని మంత్రి కోరారు.
అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ వచ్చే ఆరునెలల్లో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని, మరో మూడేళ్ళలో 24 గంటల విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, తాగునీటి కోసం రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నామని ఈటెల పేర్కొన్నారు.