mt_logo

తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన వివరణ అసంపూర్తిగా ఉంది: హరీశ్ రావు

ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

సమస్యలను పరిష్కరించకుండా, వాస్తవాలను పక్కనబెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇవే సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని నిర్దారించేటందుకు, ఈ రోజు నా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ సమస్యల పూర్తి వివరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు.

హరీష్ రావు డిమాండ్స్ 👇🏼

👉🏼 కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ. మూడు వేల గౌరవ వేతనం గతేడాది డిసెంబర్ వరకే వచ్చాయి. 2024 జనవరి, ఫ్రిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్‌లకు సంబంధించిన ఐదు నెలల వేతనాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

👉🏼 తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్‌కు సంబంధించిన నాలుగు నెలల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

👉🏼 ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు ఏప్రిల్ 2024 వరకు మాత్రమే వచ్చాయి. జూన్ నెల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

👉🏼 కోడిగుడ్డు బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్‌కు సంబంధించి నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

👉🏼 సర్వశిక్ష అభియాన్ మరియు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (IERP) వేతనాలు మే 2024 వరకే వచ్చాయి. మిగతా నెలలవి పెండింగ్‌లోనే ఉన్నాయి.

👉🏼 గతంలో పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ గ్రామపంచాయతీల ద్వారా జరిగేది. కానీ ఈ బాధ్యతను అమ్మ కమిటీలకు అప్పగించి నిర్వహిస్తామని చేసిన మీ ప్రకటన మాటలకే పరిమితమైంది. దీంతో పారిశుధ్య నిర్వహణ ప్రశ్నార్థకమైంది. ఇచ్చిన మాట ప్రకారం, తక్షణమే ప్రతి పాఠశాలకు నెలకు రూ. 10 వేలు విడుదల చేసి, పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని కోరుతున్నాను.

👉🏼 పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఆగిపోయింది. ఈ కార్యక్రమాన్ని సహృదయంతో తిరిగి పునః ప్రారంభించాలని కోరుతున్నాను.

👉🏼 పాఠశాలలకు ఉచిత కరెంట్ అందిస్తామని స్వయంగా మీరు హామీ ఇచ్చారు. ఇది కూడా మాటలకే పరిమితమైంది. అధికారిక ఉత్తర్వులు లేకపోవడం వల్ల పాఠశాలల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం, తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాను.

👉🏼 ఎస్జీటీ నుంచి స్కూల్ అసెస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 9 వేల ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ రిక్రూట్ర్మెంట్ పూర్తి అయ్యేలోగా, పిల్లలకు విద్యాబోధన జరిగేలా విద్యావాలంటీర్లను నియమించాలని కోరుతున్నాను. 

👉🏼 గతేడాదికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను.