mt_logo

లక్ష మెజార్టీతో గెలిపించాలి- హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు అతి త్వరలో సాగునీరు ఇవ్వడమే మా లక్ష్యమని ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని మిరుదొడ్డి మండల టీఆర్ఎస్ విద్యార్థి, యువత అనుబంధ సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకూ వెళ్ళి ప్రజలను కలవాలని అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చాం. మనం చేసిన అభివృద్ధి పనులను వివరించాలని, దుబ్బాక ఉపఎన్నికలో లక్ష మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు.. బీజేపీకి కార్యకర్తలు లేరు. దుబ్బాకలో ఎవరు గెలుస్తారని యువకుల నుండి పండు ముసలిని అడిగినా టీఆర్ఎస్ పార్టీదే గెలుపని అంటారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు వస్తాయా? లేదా? అని తెలుసుకోవడానికే ఈ ఉప ఎన్నికలని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో మంచినీటి కష్టాలు తొలగిపోయాయనే సంతోషంలో ప్రజలు ఉన్నట్లు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ సాగునీరు దుబ్బాక నియోజకవర్గానికే వస్తుందని, లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని, పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వుకుంటే రెండు పంటలు వేసుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బోరు బావులకు విద్యుత్ మీటర్ల బిగింపునకు చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ కు ఓటు వేసి బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలని సూచించారు. అర్హత కలిగిన వారందరికీ పింఛన్ ఇప్పించే బాధ్యత నాదే అని హరీష్ రావు హామీ ఇచ్చారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తుందా? అని ప్రశ్నించారు. దుబ్బాకలో చదివిన కేసీఆర్ సారుకు బీడీ కార్మికుల బాధలు తెలుసని, దుబ్బాకపై ప్రేమ, మమకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 35 కోట్లు కేటాయించామని, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధి చేయించుకోవాలని పార్టీ కార్యకర్తలు, సంఘాల బాధ్యులు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మార్గదర్శనం చేశారు.

కేసీఆర్ సారుకు దండం పెట్టి దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని హరీష్ రావు హామీ ఇచ్చారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీష్ రావుకు పూర్తి అవగాహన ఉందని, బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ జలాశయ కాలువ పనులు ముమ్మరంగా చేస్తుంటే కోర్టులో కేసులు పెట్టి అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *