mt_logo

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసిన హరీష్ రావు

హైదర్‌షాకోట్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల ఇండ్లను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం నేడు పరిశీలించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపదొస్తే ఫోన్ చేయండి.. అర్ధగంటలో మీ ముందుంటానని.. బుల్‌డోజర్లు వచ్చినా.. జేసీబీలు వచ్చినా.. ముందు మమ్మల్ని దాటి రావాలి అని హరీష్ రావు హెచ్చరించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి అని మండిపడ్డారు

కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి ఇళ్లు సర్వే నెంబర్ 30 రెడ్డికుంటలో ఉంది. కుంటలో ఉన్న రేవంత్ ఇళ్లు ముందు కూలగొట్టాలని సవాల్ విసిరారు. బలిసినోళ్ల దగ్గరుండి కట్టిస్తున్నావ్.. పేదల ఇండ్లకు మాత్రం కూలగొడుతున్నావ్ అని అన్నారు.

ప్రజలకు ఇబ్బంది వస్తే.. తెలంగాణ భవన్‌కు రండి. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయ్. అర్ధరాత్రి వచ్చినా ఆశ్రయమిస్తాం అని ప్రకటించారు.

ధైర్యంగా ఉండండి.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. రేవంత్ ప్రభుత్వం.. మీ ఇండ్లు ముట్టుకోకుండా మేం అండగా ఉంటాం అని బాధితులకు హరీష్ రావు భరోసానిచ్చారు. హైడ్రా పుణ్యామా అని ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీరు అధైర్యపడొద్దు.. ప్రాణాలు తీసుకొవద్దు.. మీ ఇండ్లకు ఏం కాకుండా మేము అడ్డుపడతాం అని స్పష్టం చేశారు.

1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బాధితులందరికి అనుమతులిచ్చింది. రేవంత్‌ రెడ్డి తప్పిదాలకు పేదలకు ఎందుకు బలికావాలి. ఇందిరమ్మ పాలన అంటే… పేదలకు కూడు, గుడ్డ, నీడ ఇచ్చేది.. కానీ రేవంత్ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తున్నావ్ అని ధ్వజమెత్తారు.

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి. మీ బాధ చూస్తుంటే.. నా కళ్లలో నీళ్లు వస్తున్నాయ్  మీ బాధలు వింటుంటే.. మీ కన్నీళ్లు చూస్తుంటే.. రాతి గుండె కూడా కరిగిపోతుంది.. కానీ, రేవంత్ గుండె ఎందుకు కరుగతలేదో నాకు అర్ధం కావాట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ తమ్ముడి ఇళ్లు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉన్నది.. తమ్ముడికో రూల్.. రేవంత్‌కో రూలా. దేశాన్ని కాపాడటం కోసం బార్డర్‌లో పోరాటం చేసిన సైనికులు.. ఇప్పుడు ఇండ్లు కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వ జీవిత కాలం ఐదేండ్లు మాత్రమే.. కానీ రేవంత్ కూలగొట్టే పేదల ఇండ్లు జీవిత కాలం కల. ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చు అని హితవు పలికారు. వృద్ధులకు పింఛన్, రైతులకు రైతుబంధు, మహిళలకు రూ. 2,500 ఇవ్వు, ఉద్యోగులకు డీఏ ఇవ్వు, దానికి లేని డబ్బులు మూసీ సుందరీకరణకు లక్షా యభై వేల కోట్లు ఎక్కడికెళ్లి వచ్చినయ్ అని రేవంత్‌ని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతం.. అవసరమైతే ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఉండి మీ ఇండ్లు కాపాడుతాం అని తెలిపారు. మూసీని ఆక్రమించి ఆరు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతుంటే ఎందుకు కూలగొట్టట్లే  బలిసినోళ్ల దగ్గరుండి కట్టిస్తున్నావ్.. పేదల ఇండ్లకు మాత్రం నోటీసులిస్తావా అని రేవంత్ మీద ఫైర్ అయ్యారు.

పేదలకు బీఆర్ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్ అండగా ఉంటారు. మీరంతా ధైర్యంగా ఉండండి. 1908లో వరదలొచ్చిన నిజాం రాజు ఇండ్లు కూలగొట్టలే.. కానీ రేవంత్ నిజాం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాడు. బలిసినోళ్లకు ఒక న్యాయం.. పేదోడికి ఒక న్యాయమా అని హరీష్ అడిగారు.

రేవంత్‌రెడ్డి బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వు.. మౌనం వీడి.. మూసీ సుందరీకరణ మానుకో.. స్కూళ్లలో, హాస్టల్స్‌లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుండ్రు. నీ దగ్గర పైసలు ఎక్కువుంటే ముందు వాటిని నిర్మించాలి అని సూచించారు.

గాంధీ ఆస్పత్రిలో గోలిలు లేవు, మందులు లేవు.. ముందు అవి కొని, పేదలకు మెరుగైన వైద్యం అందించు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకోకు అని సూచించారు.