mt_logo

మీ ఇష్టమొచ్చినట్లు కూల్చేస్తారా.. హైడ్రా తీరుపై హైకోర్టు ఫైర్

హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైడ్రా కమీషనర్ రంగానాథ్, ఇతర అధికారులకు చురకలు అంటించింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 22న ఆదివారం రోజున ఒక భవనం కూల్చివేతపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ ధర్మాసనం రంగనాథ్‌ను, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

హైడ్రా చేస్తున్న కూల్చివేతల పట్ల సంతోషంగా లేమని స్పష్టం చేసిన హైకోర్టు.. అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారని హైడ్రాకు చీవాట్లు పెట్టింది.

పొలిటికల్, ఎగ్జిక్యూటివ్ బాసులను సంతృప్తి పరచడానికి ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు అని హితవు పలికిన న్యాయస్థానం.. హైడ్రా కేవలం కూల్చివేతలపైన దృష్టి పెట్టిందని దుయ్యబట్టింది. నిర్మాణాలను కూల్చడానికి హైడ్రాకు ఉన్న అర్హత ఏంటని.. ఉన్న పాలసీ ఇంటి చూపించాలి అని మొట్టికాయలు వేసింది.

సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ప్రజలను ఎందుకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. ఇలాగే కొనసాగితే జీవో 99 పై (హైడ్రా జీవో) స్టే విధిస్తామని హెచ్చరించింది.

బాధితులకు కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా.. కేవలం శని, ఆదివారాలు కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని ఫైర్ అయింది. కూల్చివేతలు చేస్తున్న అధికారులు అందరిని చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తే వింటారు అని ధ్వజమెత్తింది.

స్టే ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేత చేపడతారా? నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినరా? శనివారం సాయంత్రం నోటీసు ఇచ్చి.. ఆదివారం కూల్చివేలు చేస్తారా.. సెలవు దినం రోజున విధులకు హాజరై ఎందుకు కూల్చారు? అంటూ న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు.

తహసీల్దార్‌లు అడిగితే సిబ్బంది, యంత్రాలు ఇచ్చేస్తారా? హైడ్రా కమిషనర్‌గా మీకు చట్టం తెలియదా? రేపు చార్మినార్‌ తహసీల్దార్‌ హైకోర్టును కూల్చమంటే ఇలాగే వ్యవహరిస్తారా? అని రంగానాథ్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేం సమర్థించడం లేదు.. చర్యలు చేపట్టాల్సిందే.. కానీ, నిబంధనలు పాటించాల్సిందే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాత్రికి రాత్రి సిటీని మార్చేద్దాం అనుకుంటే సాధ్యం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది.

డిజాస్టర్‌ మ్యానేజ్‌మెంట్ అంటే ఒక్క కూల్చివేతలే కాదు.. ఇంకా చాలా ఉన్నయ్‌. అవన్నీ హైడ్రా ఎందుకు చేయడం లేదు అని కోర్టు అడిగింది. మూసీపై మీ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటీ? ఏదీ లేకుండా కూల్చివేతే పరమావధిగా వ్యవహరిస్తారా? అని చురకలు అంటించింది.

హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్‌ లోపల ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నయో తెలుసా? ఎన్నింటికి ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌పై తుది నోటిఫికేషన్‌ ఇచ్చారు అని అడిగింది.. హైడ్రా తీరు తీవ్ర అందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.

తదుపరి విచారణలోగా హైడ్రా, తహసీల్దార్‌ కౌంటర్‌ దాఖలు చేయాలని విచారణను అక్టోబర్‌ 15కు కోర్టు వాయిదా వేసింది.