mt_logo

ఆటలు సాగనివ్వం.. జాతీయ స్థాయిలో ఉద్యమం!

సెక్షన్-8 ని కేంద్రం అమలుచేయాలని చూస్తే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఆటలు సాగనివ్వమని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు హెచ్చరించారు. రాజ్యాంగంలోని 163 నిబంధన ముసుగులో హైదరాబాద్ పై పెత్తనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మెదక్ జిల్లా ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులతో ఆధారాలతో దొరికిన దొంగల ముఠాను రక్షించుకునేందుకే ఈ రాద్ధాంతం అన్నారు.

శాంతి భద్రతలు లోపించినప్పుడే సెక్షన్-8 పై మాట్లాడాలి. కానీ చంద్రబాబు అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే తెలంగాణ వచ్చిన ఏడాది తర్వాత కొత్త నాటకాలకు తెరలేపాడని, దేశంలో 28 రాష్ట్రాల రాజధానులపై ఎలాంటి హక్కు ఉంటుందో, 29వ రాష్ట్రమైన తెలంగాణకు హైదరాబాద్ పై కూడా అవే హక్కులు ఉంటాయని హరీష్ తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, హక్కులకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా మళ్ళీ ఉద్యమించేందుకు వెనుకాడబోమని, టీఆర్ఎస్ కు, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. సెక్షన్-8, ఆర్టికల్ 163 ఏం చెప్తున్నాయో కనీస పరిజ్ఞానం లేకుండా ఏపీ నేతలు మాట్లాడడం వింతగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.

తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడే అప్పటి బీజేపీ పార్లమెంటరీ ఉపనేత, ప్రస్తుత ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సెక్షన్-8 పై అభ్యంతరం వ్యక్తం చేశారని, 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుతం ప్రధాని మోడీకి రాష్ట్ర రాజధానిపై ఆ రాష్ట్రానికి ఎలాంటి హక్కులు ఉంటాయో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని హరీష్ రావు వివరించారు. హైదరాబాద్ పై మోడీ తప్పుడు నిర్ణయం తీసుకోరనే నమ్మకం తమకు ఉందని, ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలు మానుకుని నోటుకు ఓటు వ్యవహారంలో తప్పు ఒప్పుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *