mt_logo

లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని డీజీపీ హామీ మేరకు సహకరిస్తున్నాం: హరీష్ రావు


ఒకవైపు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం జరుగుతుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు డీజీపీ హామీ మేరకు ఇక్కడి నుంచి వెళ్తున్నాం అని కేశంపేట పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

తెలంగాణ తెచ్చిన పార్టీగా, బాధ్యత గల శాసనసభ్యులుగా లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని మేం సహకరిస్తున్నాం స్పష్టం చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని ఖండించిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటి‌పైన దాడి చేసిన విధానాన్ని మీరంతా చూశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి‌పైన దాడి జరిగిందని, చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మమ్మల్ని అరెస్ట్ చేశారు అని అన్నారు.

రాష్ట్ర డీజీపీ మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. మనది తెలంగాణ ఉద్యమ పార్టీ, పోరాటం చేస్తే తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే పార్టీ మనది అని పేర్కొన్నారు.

ఒకవైపు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం జరుగుతుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు డీజీపీ హామీ మేరకు మనందరం ఇక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అని అన్నారు.

కొద్ది నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇటు వైపు తీసుకొస్తున్నారని తెలవగానే మీ ప్రాణాలకు తెగించి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద జరిగిన దాడిపై కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీనిచ్చారు అని తెలిపారు.

పోలీసులు కూడా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మీ మాట మీద నిలబడాలని కోరుతున్నాను. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వద్ద ఉండొచ్చు రేపు మా దగ్గర ఉండొచ్చు.. కానీ ధర్మాన్ని న్యాయాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మేము వెళ్లిపోయిన తర్వాత కార్యకర్తలని పోలీసులు ఇబ్బంది పెడితే తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుంది. కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడి, అన్నం తినకుండా ఇక్కడ వేచి ఉన్నారు. వారంతా తిరిగి గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు

ప్రభుత్వ మెడలు వంచి రైతు రుణమాఫీ కావాలి, ఆసరా పెన్షన్లు రావాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి మనం పోరాటం కొనసాగిద్దాం అని పిలుపునిచ్చారు. జిల్లాలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలని బైండోవర్ చేశారని సమాచారం వచ్చిందని.. వారందరిని కూడా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.