mt_logo

హంతకులే సంతాప సభలు పెడతారా? – కేటీఆర్

నలభై ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నాలుగునెలల నవజాత శిశువైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హత్య చేస్తున్న క్రూరులు కాంగ్రెస్ నేతలని, రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలు హత్యలు చేసినవారే సంతాపసభలు పెడుతున్నట్లుగా ఉందని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నేతలకు పలు ప్రశ్నలతో రాసిన బహిరంగ లేఖను మంగళవారం కేటీఆర్ మీడియాకు విడుదల చేశారు. గతంలో తాను రాసిన లేఖకు బదులియ్యలేక మొహం చాటేశారని, కనీసం ఈ లేఖకైనా సమాధానం ఇవ్వకపోతే ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు.

నాలుగు దశాబ్ధాలు కరెంటును పట్టించుకోకుండా గతంలో ధర్నాలు, ఆందోళనలు చేసిన రైతుల్ని పొట్టనబెట్టుకుని ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు ఇప్పుడు హత్యచేసిన వారే సంతాపసభలు పెడుతున్నారని, తెలంగాణలో చోటుచేసుకున్న ప్రతి రైతు ఆత్మహత్యా గతంలోని కాంగ్రెస్ పాపాల ఫలితమే. రైతుల పంటలను, జనం గొంతును ఎండబెట్టి సీమాంధ్రకు అక్రమంగా జలాలను తీసుకెళ్ళిన ముఖ్యమంత్రులకు అండగా నిలిచిన తెలంగాణ ద్రోహులు మీరుకాదా?

ఇరిగేషన్ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తెలంగాణలోని ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాడో చెప్పగలడా? భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు మొండిచెయ్యి చూపినా చుక్క నీరు కేటాయించని హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టుకు ఆంధ్రా ఆడబిడ్డలా హారతి పట్టి బొట్టు పెట్టింది డీకే అరుణ కాదా? పెట్రోలియం, గ్యాస్ మంత్రిగా ఉండికూడా జైపాల్ రెడ్డి తెలంగాణలోని నేదునూరు, శంకర్ పల్లి గ్యాస్ ఆధారిత కేంద్రాలకు గ్యాస్ ఇవ్వకపోవడం చొరవ లేకపోవడమా? చేతగానితనమా?

కరెంటు కోసం జరిగిన ఉద్యమంలో ముగ్గురు రైతుల్ని బషీర్ బాగ్ లో కాల్చి చంపిన టీడీపీ రికార్డును చెరిపేందుకు పోటీపడ్డ నరహంతకులు మీరు. ఖమ్మంలో, ముదిగొండలో ఐదుగుర్ని కాల్చిచంపిన కర్కోటక రైతు హంతకులు మీరు. రూ. పది కోట్ల ఎర్రజొన్న బకాయిలను అడిగిన ఆర్మూర్ రైతులపై బుల్లెట్ల వాన కురిపించిన చరిత్ర మీదికాదా? పాలకపక్షం నుండి ప్రతిపక్ష పాత్రలోకి మారగానే తాము చేసిన పాపాల్ని ప్రజలు మరిచిపోయారనుకుంటున్నా ఈ లేటెస్ట్ గజినీలను అస్సలు మరిచిపోరు.

ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండి రైతుల సంక్షేమం కోసం కంకణం కట్టుకున్న ప్రభుత్వం మాది. అందుకే ఇచ్చిన హామీ మేరకు రూ. 17 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తున్నాం. రూ. 4,250 కోట్లను విడుదల చేసి మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే రూ. 486 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేశాం. ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న ఎర్రజొన్న రైతుల బకాయిలు రూ. 10 కోట్లు చెల్లించాం. చెరువుల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. అవసరమైతే సీడీలు మీ ఇంటికి పంపుతాం. మాయమాటలు చెప్పేది, ప్రజల్ని వంచించేది ముమ్మాటికీ మీరే. అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా బూటకపు నాటకాలు కట్టిపెట్టి రైతు సమస్యల్ని తీర్చేందుకు ప్రతిపక్షంగా ముందుకురండని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *