By: తిరుమల్ రెడ్డి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ప్రార్ధనలతో, ఉపవాస దీక్షలతో గడుపుతారు. ఐహిక సుఖాలకు దూరంగా ఉంటూ, దైవ చింతనతో గడిపే రోజులివి. దాంతోపాటు ప్రతిరోజు దీక్ష విరమించిన తర్వాత వారు తీసుకునే ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం దాక ఎలాంటి ఆహారం లేకుండా నిస్సత్తువ ఆవహించిన వారికి శక్తినందించే ఆహారం ఎంతో అవసరం. సరిగ్గా అందుకోసమే అన్నట్టు తయారయ్యింది ‘హైదరాబాదీ హలీం’. పొట్టేలు మాంసం, గోధుమలు, బార్లీ, పప్పులతోపాటు అనేక మసాలాల మిశ్రమంతో చేసే హలీం కేవలం హైదరాబాదీలకే కాదు విశ్వవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రీతిపాత్రమైనది.
భారత్ తో సహా అనేక దేశాల్లో దీన్ని తయారు చేస్తున్నా, ఒక్క ‘హైదరాబాదీ హలీం’ కే భౌగోళిక చిహ్నంగా (Geographical Indication) గుర్తింపు వచ్చిందంటే అది హైదరాబాద్ సాంప్రదాయ వంటలకు ఉన్న ప్రత్యేకత ఏంటో రుజువు చేస్తుంది. ఇంతకీ హలీం మొదట తయారైంది మాత్రం హైదరాబాద్లో కాదు. మధ్య ప్రాచ్యంలో చిన్న దేశమైన యెమెన్లో స్థానిక తెగల వారు దీన్ని వందల ఏళ్ళ కింద తయారు చేశారు. అయితే అది ఇప్పటి హలీం కంటే భిన్నంగా ఉండేది. ఇక హైదరాబాదుకు వలస వచ్చిన అరబ్బులు, పర్షియన్లు డెక్కన్ ప్రాంతంలో తమ ఇతర వంటలతో పాటు హలీమ్ ను కూడా పరిచయం చేశారు. ఇక్కడి ఆహారపుటలవాట్లు, పాకశాస్త్ర వైవిధ్యం హలీం రుచిని మరింత ఇనుమడింపచేశాయి. ఇవాళ హైదరాబాదీ వంటల్లో అతిముఖ్యమైన స్థానం సంపాదించిన హలీం, భారత్ లో భౌగోళిక చిహ్నం పొందిన మొదటి మాంసాహార వంటంకంగా నిలిచింది. గత ఏడాది కేవలం హైదరాబాద్లోనే దాదాపు ఆరువేల హలీం భట్టీలు ఏర్పాటయ్యాయి. సుమారు యాభై దేశాలకు ఎగుమతి చేసిన హలీం తయారీదార్లు వంద కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసారు. ఈ ఏడు అది మరింతగా పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలను గంగ-జమునా తెహజీబ్ గా అభివర్ణించడం తెలిసిందే. హలీం కూడా దానికి అతీతం కాదు. ముస్లింలతోపాటు ఇతర మతస్తులు కూడా హలీం ను ఎంతో ఇష్టంగా తింటారు. రంజాన్ నెలరోజులూ పాతబస్తీ నుంచి హైటెక్ సిటీవరకు గల్లీకో హలీం భట్టీ, దాని చుట్టూ వందలమంది కస్టమర్లు కనిపిస్తారు. హైదరాబాదుకు వలస వచ్చినవారు, పర్యాటకులు సైతం హలీం రుచి చూడకుండా ఉండలేరు. ఇంతలా హైదరాబాదుతో హలీం రుచి పెనవేసుకుపోవడానికి కారణం అది ఓ వంటకం మాత్రమే కాదు ఇక్కడి ఐక్యతకు, ప్రత్యేకతకు, అస్తిత్వానికి చిహ్నం .