mt_logo

మానవత్వపు మట్టివాసన: మార్లవాయి

‘హైమన్ డార్ఫ్ ఎలిజబెత్ దంపతుల గురించి కళాశాల విద్యార్థిగా వున్నప్పుడు దినపత్రికల్లో చదివి ఉత్తేజం పొందిన నేను ప్రస్తుతం గోండు పల్లెల కొరకు, ఆ పల్లెల పిల్లల కొరకు పనిచేస్తున్న కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా ఉన్నాను. ఈ బాధ్యతే నన్ను హైమన్ డార్ఫ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మార్లవాయికి తీసుకుపోయింది.’
~ మట్టా సంపత్‌కుమార్ రెడ్డి

కన్నప్రేమ కన్నా సాదిన ప్రేమ ఎక్కువన్నది పెద్దల మాట. ఇది డార్ఫ్ దంపతుల విషయంలో సంపూర్ణంగా వర్తిస్తుంది. ఎక్కడో ఐరోపా ఖండంలో జన్మించి, గిరిజన అధ్యయన వేత్తగా ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎన్నో జాతుల్ని కలిసి ఎంతో అనుభవాన్ని మూటగట్టుకున్న శాస్త్రవేత్త ఆయన. ‘తెలంగాణ మాగాణపు దట్టమైన అడవుల మధ్య నున్న ఒకానొక గోండు పల్లె మార్లవాయినే ఆయన తన కన్నతల్లి కన్నా ఎక్కువగా ఎందుకు ఇష్టపడ్డాడు?. దాన్నే తన శాశ్వత విశ్రాంతి స్థావరంగా ఎందుకు ఎన్నుకున్నాడు?…ఈ ప్రశ్నలకు జవాబు తెలంగాణ చరిత్ర పొడవునా కనిపించేదే!

తమ ఇంటికి వచ్చిన అతిథిని కంటిలో పాపగా చూసుకునే మహోన్నత మానవత్వం ఈ గడ్డది. తమ బాగోగులు పట్టించుకునేందుకు వచ్చిన పరాయిదేశపు పడచు జంటను మార్లవాయి గిరిజన గ్రామం రెండు తరాల కిందటే అత్యాధునిక దృక్పథంతో అక్కున చేర్చుకుంది. ఆనాడు మొదలు, డార్ఫ్ చనిపోయిన 17వ యేట అస్థికల రూపంలో తిరిగివచ్చిన ఇవాలిటిదాకా మార్లవాయి మట్టిలో అదే ఆత్మీయత, అదే స్ఫూర్తి.

అస్థికలను తీసుకువచ్చిన డార్ఫ్ కుటుంబీలకు తెలంగాణ గిరిజన సాంప్రదాయం ఆర్థ్రతతో అరుదైన స్వాగతం పలికింది. ఊరి బయట నుండే మేళతాళాలతో ఎదుర్కొని, తాంబాళంలో కాళ్ళు కడిగి, నుదుట బొట్టుపెట్టి, మెడలో దండ వేసి , కూర్చునేందుకు మంచమేసి, పంచెతో సత్కరించీ, మంచి నీళ్లిచ్చి కండ్ల నీళ్లు తీసుకొని మాట ముచ్చటతో ఔననంగా అరుసుకున్నది. ఈ మానవీయత డార్ఫ్ కుటుంబీకులనే కాదు, అక్కడున్న ఎందరికో కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. ఈ ఆతిథ్యాన్ని, ఇందులోని ప్రేమగాఢతను కండ్లారా చూసినప్పుడు బమ్మెర పోతన భాగవతంలో కుచేలుడికి కృష్ణుడి చేత అతిథి మర్యాదలు చేయించింది ఈ స్థానిక మానవీయ విలువల పరంపరే కావచ్చునని తోచి, మనసు తడిబారింది. ఈ మానవీయ స్పర్శే మార్లవాయి మట్టి సుగంధం. ఇదే డార్ఫ్‌ను అతని అస్థికలను గుండెలకు హత్తుకొన్నది. తనలో ఐక్యపరుచుకొన్నది.

మైదాన ప్రాంతీయుల మాదిరిగానే, తెలంగాణ అడవి బిడ్డలు ఎంతటి శ్రమజీవులో అంతటి స్వాభిమానధనులు. ఎంత బొల్లకోరు మనుషులో అంతే పోరాట శీలం కలవారు. దండకారణ్యపు కోయగోండు పోరాట స్ఫూర్తి ఈనాటిది కాదు. సమ్మక్క సారలమ్మ, రాణీ దుర్గావతీ, కొమురం భీం పరంపరకు మైలురాళ్ళు. ‘జల్-జంగల్-జమీన్’ నినాదంతో 192 నుండి 1940 వరకు నిజాం నిరంకుశత్వాన్ని గుండెలొడ్డి ఎదిరించిన పోరాటవీరుడు, కొమురం భీం. భీం తెచ్చిన కదలికతో మేల్కొన్న నిజాం గోండు ప్రజల జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయమని నిజాం కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ‘క్రిస్టఫర్ వాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్’ను నియమించాడు. దట్టమైన అడవులతో, కఠినమైన భౌగోళికతతో కూడిన అదిలాబాద్ జిల్లా నడిమధ్యన గల ఒకానొక మారుమూల గోండు గూడెమే మార్లవాయి. డెబ్భై యేళ్ళ కింద ఈ పల్లెకు కాలినడకన చేరుకోవడం కూడా కష్టమైన పని. ‘పుట్టిన ప్రతి మనిషీ అభివృద్ధికి అర్హుడే’ అన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకొని హైమన్ డార్ఫ్ దంపతులు 1941లో మార్లవాయిలో అడుగుపెట్టారు.

1941 నుండి 1943 వరకు సంపూర్ణంగా, ఆ తర్వాత 1956 వరకు అడపా దడపా డార్ఫ్ దంపతులు గిరిజనులతో మమేకమై జీవించారు. గోండు మంత్రాల మాటేమోగానీ గోండుల ఆత్మీయత వీరిని మంత్రముగ్ధులను చేసింది. మార్లవాయిని తమ పెంపుడు తల్లిగా, పల్లె జనాన్ని ఆత్మబంధువులుగా మార్చుకోగలిగారు. ఎప్పుడూ డార్ఫ్ దంపతుల చుట్టూ తిరుగుతూ, వారి అవసరాలు తీరుస్తూ ప్రీతి పాత్రుడుగా మారిన గోండు యువకుడు ఆత్రం లచ్చు పటేల్ అనారోగ్య పీడితుడై ఆకస్మికంగా మరణించాడు. అతడంటే డార్ఫ్ దంపతులకు గుండెడు ప్రేమ. ఆ ప్రేమకు పర్యాయంగా జన్మించిన తమ (మగ సంతానం) కొడుకుకు ‘ఆత్రం లచ్చు పటేల్’ అని పేరు పెట్టుకుని ఆ యువకుడి స్మృతిని తమ వారసుడిలో నిలుపుకున్నారాయన.

డార్ఫ్ దంపతులు తరచుగా మార్లవాయిని సందర్శించేవారు. మరణానంతరం భౌతిక కాయాన్ని గిరిజన పద్ధతులతో మార్లవాయిలో గిరిజన లచ్చు పటేల్ సమాధి పక్కనే పూడ్చిపెట్టాలని ఎలిజబెత్ గిరిజనుల దగ్గర మాట తీసుకుంది. తర్వాత రెండు సంవత్సరాలకే ఆమె మరణించింది. ఎలిజబెత్ కోరిక మేరకు ఆత్మబంధువులైన గోండులు లచ్చు పటేల్ సమాధి పక్కనే సమాధి నిర్మించి కర్మకాండ జరిపారు. మానసికంగా కుంగిపోయిన హైమన్ డార్ఫ్ భార్య సమాధి పక్కనే తనకూ ముందుగానే సమాధి నిర్మింపజేసుకున్నాడు.

ఒంటరిగా మిగిలిన డార్ఫ్‌ను బంధుమిత్రులు హైదరాబాద్ నుండి లండన్ పిలిపించుకున్నారు. భౌతికంగా లండన్‌లో వున్నా అతడి మనసు మార్లవాయి చెట్టుచేమల్లోనే సంచరించేదేమో! మార్లవాయి మట్టిలోనే తన అస్థికలనూ ఐక్యం చేయాలని కొడుక్కు చెప్పి 1995లో డార్ఫ్ తుదిశ్వాస విడిచాడు. పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ బాధ్యతల నుండి ఇటీవలే విరమణ పొందిన డార్ఫ్ కొడుకు ఆత్రం లచ్చు పటేల్ అలియాస్ నికోలస్ తండ్రి చివరి కోరిక తీర్చేందుకు సన్నద్ధమైనాడు. భార్య సారా, కొడుకు హైమన్ డార్ఫ్‌లతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ నెల 26 తేదీన ఆదివారం నాడు గిరిజన సంప్రదాయబద్ధంగా మనవడు హైమన్ డార్ఫ్ తన తాత కర్మకాండను నిర్వహించాడు. మనవడిలో తాతను చూసుకొని ఆ తరం గోండులు తన్మయత్వం చెందారు. డార్ఫ్ దంపతులతో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నప్పుడు వారి కండ్లల్లో మెరుపును మాటల్లో చెప్పలేం.ఆత్మీయతకు పరాకాష్ట కరస్పర్శో, కన్నీళ్ళోగానీ కేవలం మాటలు కాదుగదా!

~ ఏ కొమ్మకు పూసిన పువ్వు ఎటువైపు దృష్టి సారిస్తుందో, ఏ గాలికి గంధాన్ని పులుముతుందో, ఏ వానకు రాలి ఏ ప్రవాహంలో పడి, ఏ మట్టిలో కలిసిపోతుందో ఎవరూ చెప్పలేరు. మనిషి జీవితం పువ్వులాంటిదే. డార్ఫ్ దంపతుల జీవితమే దీనికి సజీవ సాక్ష్యం. మార్లవాయి గిరిజనం మానవీయతకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేక మరణించినా తామిక్కడే సమాధి కావాలనుకున్నారు. మరో మాటలో చెబితే, హైమన్ డార్ఫ్ మార్లవాయిని పెంపుడు తల్లిగా భావించాడు. మరణం ఏనాడు ఎదురొచ్చినా, తాను ఎక్కడ నేలకొరిగినా తన పెంపుడు తల్లి ఒడిలోనే పడుకోబెట్టి సాగనంపాలని కొడుకును చివరిసారి కోరుకున్నాడు. మార్లవాయి కూడా తన దత్తపువూతుడి కొరకు పదిహేడు ఏండ్లుగా తలపోసి తండ్లాడుతున్నది. గత పక్షానికి రెండువైపుల ఈ నిరీక్షణలు ముగిసాయి. పొదు ్దతల్లి కడుపులోకి వెళ్ళిపోయినట్లు హైమన్ డార్ఫ్ మార్లవాయి మట్టిలో ఒదిగిపోయాడు. డార్ఫ్ స్మృతి చిహ్నంగా పాతిన జెండా దగ్గర గోండులు బీడీలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు

***
లచ్చు పటేల్‌తో ముఖాముఖి

హైమన్‌డార్ఫ్ తనయుడు నికోలస్ మాట్లాడుతూ ‘‘నేనూ భారతీయుడినే’ అన్నారు. నిజమే మరి. ఆయన పుట్టింది మన దేశంలోనే. అదీ తెలంగాణంలోనే. ఇక్కడే… సికింద్రాబాద్ లోనే ఆయన జన్మించారు. తన పేరు కూడా స్థానిక గిరిజనుడి పేరు లచ్చు పటేలే! ‘బతుకమ్మ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ విషయాలను పంచుకుంటూ, ‘‘1946లో నేను సికింద్రాబాద్ లో జన్మించాను. ఆ తరువాత రెండు సంవత్సరాలు మార్లవాయిలో, ఇంకో నాలుగు సంవత్సరాలు నేపాల్, నాగాలాండ్‌లోని గిరిజన ప్రాంతాల్లో అమ్మా నాన్నల వద్ద పెరిగాను. ఆ తర్వాత లండన్‌కు వెళ్లానుగానీ నిజం చెప్పాలంటే ఇక్కడే పుట్టి పెరిగాను. కాబట్టి నేనూ భారతీయున్నే’’ అని ఆయన సగర్వంగా చెప్పారు.

తన భార్య సార, కుమారుడు క్రిస్టఫర్ హైమన్‌డార్ఫ్, కుటుంబ సన్నిహితురాలు ఫ్రీజన్‌లతో కలిసి మార్లవాయిలో తన తండ్రి అస్థికలను సమాధి చేయడానికి వచ్చామని, ఇన్నాళ్లకు తన తండ్రి కోరిక తీరడం పట్ల తమకెంతో సంతృప్తిగా ఉందని చెప్పారాయన.

నికోలస్ ఆరేళ్ల వయసున్నప్పుడు లండన్‌కు వెళ్లిపోయి, అక్కడే అమ్మమ్మ వద్ద పెరిగిండట. అటు తర్వాత 197లో హైదరాబాద్‌లో తన తల్లి బ్రెట్టీ ఎలిజబిత్ చనిపోయినప్పుడు మార్లవాయిలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి తానూ వచ్చిండట. 1995లో తన తండ్రి హైమన్‌డార్ఫ్ లండన్‌లో చనిపోయినప్పుడు ఆయన మృతదేహాన్ని మార్లవాయికి తీసుకరావడం కుదరలేదనీ, ఇప్పటికైనా తండ్రి అభిలాష మేరకు అస్థికలను మార్లవాయికి తీసుకువచ్చి (ఫిబ్రవరి 26న), గిరిజన సంప్రదాయం ప్రకారం పూడ్చి పెట్టడం తమకెంతో సంతృప్తిని మిగిల్చిందని నికోలస్ వివరించారు.

‘‘నేనూ భారతీయుడినే..’’‘‘అమ్మానాన్నలు నన్ను మార్లవాయికి తీసుకురాగానే గ్రామస్థులు నా పేరు లచ్చు పటేల్‌ నామకరణం చేశారు. వీళ్ల చేతిలోనే నేను పెద్దయ్యానని నాన్న చెప్పేవారు. అప్పటినుంచి నేను మీ లచ్చు పటేల్‌ – భారతీయుడినే…’’

మీ భార్యా, పిల్లల పరిచయం!

-సార నా భార్య. ఆమె సామాజిక సేవకురాలిగా పనిచేస్తోంది. కుమారుడు క్రిస్టఫర్ హైమన్‌డార్ఫ్ స్కాట్‌లాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇక మా కుటుంబ సన్నిహితురాలు ఫ్రీజన్…ఆమె గిరిజనుల ఆచారాలపై పుస్తకం రాయనుంది. లండన్‌నుంచి మేం ముగ్గురం కలిసి వచ్చాం. అయితే, నా చిన్న కుమారుడు మాక్స్ లండన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. తను మార్లవాయికి రాలేకపోయాడు. ఇక నా విషయం. నేను గవర్నమెంట్ సెక్టార్‌లో చార్టెడ్ అక్కౌంటెంట్‌గా పనిచేసి ఈ మధ్యే రిటైర్ అయ్యాను. అందుకే ఈ ముఖ్యమైన కార్యం మీద ఇప్పటికి మార్లవాయి రాగలిగాను.ఇన్నేళ్ల తర్వాత మార్లవాయికి వచ్చి అస్థికలను సమాధి చేయడానికి ఇంకేమైనా ముఖ్య కారణముందా?

-చనిపోయాక తన ఆస్థికలను అమ్మ సమాధి పక్కన పూడ్చిపెట్టాలని నాన్న రాసుకున్న పుస్తకంలో చదివాను. ఆయన కోరికను తీర్చడం నా కనీస ధర్మం. అందుకోసమే కష్టాలను ఓర్చి, మార్లవాయికి వచ్చి ఆస్థికలను సమాధి చేశాను. దీంతో మా నాన్న ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నాను.

గిరిజన, ఆదివాసీల సంప్రదాయాల గురించి మీకు ఇదివరకే తెలుసా..?

-తెలుసనే చెప్పాలి. నాన్నగారు రాసిన పుస్తకాల్లో చదివాను. గిరిజనుల అమాయకత్వం, నమ్మకం, సంప్రదాయం తదితర విషయాలపై నాకూ కాస్త పట్టుంది. అందుకే నాన్నగారి అస్థికలను గిరిజన సంప్రదాయం ప్రకారమే సమాధి చేయగలిగాను. గిరిజనులు చెప్పే ప్రతీ విషయం నాకు అర్థమవుతోంది. గిరిజన సంప్రదాయం ప్రకారం తాత అస్థికలు మనుమడితో చేయిస్తారు. అందుకే నా కొడుకు క్రిస్టఫర్‌తో ఆ కార్యాన్ని పూర్తి చేయించాను.

మీరు గతంలోకూడా మార్లవాయికి వచ్చానన్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా తేడా గమనించారా..?

-చాలా తేడా కనిపించింది! గిరిజనుల జీవనశైలిలో చాలామార్పు వచ్చింది! 197లో మా తల్లి చనిపోయిన సందర్భంలో వచ్చినప్పుడు ఇక్కడన్నీ మట్టిఇండ్లు… వెదురుతో కట్టుకున్న ఇండ్లే కనిపించేవి. ఇప్పుడు వాటిస్థానంలో సిమెంట్‌తో కట్టుకున్న ఇండ్లు కనిపించాయి. గిరిజనుల జీవనశైలిలోకూడా చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది.

లండన్‌లో ఉండే మీకు మార్లవాయి లాంటి గిరిజన ప్రాంతంలో ఎటువంటి ప్రత్యేకత కనిపించింది?

-అనుబంధాలు. అవును. ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు చాలా బలంగా ఉన్నట్లు గమనించాను. అమ్మా నాన్నల పట్ల గౌరవాభిమానాలు, అన్నా చెల్లెళ్ల అనుబంధాలు, చిన్నా పెద్దల మధ్య గౌరవ మర్యాదలు బాగుంటాయి. ఇవి పాశ్చాత్యదేశాల్లో కొరవడుతున్నాయి. భారతీయులను చూసి ఇప్పుడిపుడు పాశ్చాత్యదేశాల్లోకూడా ఇలాంటి ప్రేమానుబంధాలు పెరుగుతున్నాయనే అనిపిస్తుంది.

మీరు క్రిస్టియన్ అయి ఉండి గిరిజన సంప్రదాయంలో తండ్రి అస్థికలను పూడ్చి పెట్టారు. దీనికి మీ మతం ఒప్పుకుంటుందా?

-నాన్న చివరి ఆశయం ముందు ఏ మతమూ పనిచేయదనే అనుకుంటున్నాను. అయినా నేను మీ లచ్చు పటేల్‌, ఇక్కడే నేను పుట్టి పెరిగాను. మమ్మల్ని గిరిజనులు ఎంతగానో ఆదరించారు! అందుకే వారి సంప్రదాయాన్ని నేనూ గౌరవిస్తున్నాను! సేవ చేయాలనే దృక్పథం ముందు మతం పనిచేయకూడదని నా అభిప్రాయం. గిరిజనుల సంప్రదాయంలో అస్థికలు సమాధి చేయడం నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది.

అన్నట్టు, మీకు లచ్చు ప అన్న పేరు ఎందుకు పెట్టారో వివరిస్తారా?

-మార్లవాయి గ్రామప లచ్చు ప ఆయన మరణించిన సంవత్సరంలోనే నేను జన్మించానట. అమ్మానాన్నలు నన్ను మార్లవాయికి తీసుకురాగానే గ్రామస్థులు నా పేరు లచ్చు ప నామకరణం చేశారు. మార్లవాయి గ్రామస్థుల చేతిలోనే నేను పెద్దయ్యానని మా నాన్న కూడా చెప్పేవారు.

బతికున్నపుడు నాన్నగారు ఇంకేం చెబుతుండేవారు?

-‘ఆదివాసుల సమస్యలను వెలికితీసి పరిష్కార మార్గాలను చూపాలని నాకు నిజాం సర్కారు పని అప్పజెప్పింది. ఆ పనిలో సంతృప్తి ఉంది’ అని చెబుతుండేవారు. మీరుకూడా ఆదివాసుల బాగుకోసం పనిచేయమని మా కుటుంబ సభ్యులతో అంటుండేవారు! నాకు తోచినరీతిలో ఆదివాసుల అభ్యున్నతికోసం ప్రయత్నిస్తాను.

మళ్లీ భారతదేశం ఎప్పుడొస్తారు?

-ఇప్పుడే చెప్పలేను. మా ప్రయాణం బాగానే జరిగింది. భారతదేశంలో అన్నిచోట్ల వాతావరణం అనుకూలించినప్పటికీ వ్యయ ప్రయాసల నడుమ మార్లవాయి ప్రయాణం జరిగింది. అయితే, మళ్లీ ఎప్పుడొచ్చేదీ చెప్పలేను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన భార్య సార, కుమారుడు హైమన్‌డార్ఫ్, సన్నిహితురాలు ఫ్రీజన్‌లకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *