mt_logo

నా గుంటూరు ట్రిప్ రిపోర్ట్

By: స్వర్ణలత

వారం రోజుల క్రితం పర్సనల్ పని మీద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో గుంటూర్ వెళ్ళాను. సీమాంధ్ర బంద్  నేపధ్యంలో ఎఫెక్ట్ ఎలా వుంటుందో అనే ఉత్సుకతతో బస్ దిగాను. ఆటో ఎక్కినాక డ్రైవర్ తో జరిగిన సంభాషణ:

“ఇక్కడ బంద్  ప్రభావం ఎలా వుంది?”

“ఆ..ఏమీ లేదమ్మా .. వుదయం 9 టు మధ్యాహ్నం 2 వరకు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, ఐనా మాలాటోళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదమ్మా అంతా రాజకీయనాయకుల డ్రామా. ఇప్పుడు తెలంగాణ వస్తే మాకు నీళ్ళు రావంట కదా”  అని ప్రశ్నించాడు.

అప్పుడు నేను “సముద్రం లో చాలా నీళ్ళు వృధాగా పోతున్నాయి కదా వాటిని మీకు మళ్ళించుకుంటే సరిపోతుంది” అని జవాబిచ్చాను.

“సమస్య ఇంత సింపుల్ గా పరిష్కారం ఐపోతుందా” అన్నాడు.

“అది మాత్రం మీ రాజకీయ నాయకుల మీదే ఆధారపడి వుంది” అన్నాను.

ఉద్యోగాలు, నిధుల కన్నా నీళ్ళను వాళ్ళ రాజకీయ నాయకులు బాగా వాడుకుంటున్నారనిపించింది.

ఫ్రెండ్ ఇంట్లో దిగి ఫ్రెష్ ఐనాక షాపింగ్ కి బయలుదేరాము.

ఆటోలు వుంటాయా అని ఫ్రెండ్ ని అడగ్గానే ఆటోలేంటి బస్ లు కూడా వుంటాయని అనేసరికి నాకు కొంచెం షాక్. బస్సెక్కి బిగ్గెస్ట్ షాపింగ్ సెంటర్ బ్రాడీపేట్లో దిగాము. బస్ ఎక్కినప్పటినుంచి దిగేవరకు ఎక్కడైనా సమ్మె ప్రభావం వుంటుందేమోనని చూస్తూనే వున్నాను, ఇంక లేదు అనుకునే సమయంలో నాకు ఒక గుంపు కనిపించింది.

బస్ లో నుండి తొంగి చూసాను. టీవీల్లో చూసింది నిజమే అనిపించింది. ఒక పాతిక మంది చిన్న చిన్న పిల్లలు జై “సమైఖ్యాంధ్ర” బానర్లతో …చెమటలు కక్కుతూ …నిజంగా వాళ్లని చూస్తే బాధనిపించింది.

అసలు వాళ్ళని చూస్తే సమైక్యాంధ్రకు అర్ధం కూడా తెలియదనిపించింది. తర్వాత రోజు కూడా నాకు సేం సీన్ రిపీట్ అయ్యింది. నాకు అర్ధంకానిదల్లా ఒక్కటే. రోజూ మీడియాలో చూపిస్తున్న “సీమాంధ్ర అగ్నిగుండం, రోడ్ల పైనే అన్నీ (అంట్లు తోమడం, బట్టలు వుతకడం, స్నానాలు వగైరా), “రగులుతున్న. ఉడుకుతున్న, మరుగుతున్న సీమాంద్ర” ఇవేమీ నాకు కనపడలేదు.

కనీసం ద్వినేత్ర సిద్ధాంతి  చెప్తున్న తెలుగు జాతి ఆవేదన కూడా ఎక్కడా కనపడలేదు. అప్పుడు అనుకున్నాను నేను హైదరాబాదు వచ్చాక ఒక సారి ఐ స్పెషలిష్ట్ కు చూపించుకుని ఒకసారి ఏ విశాఖపట్నమో పోయిరావాలి.

ఏమో అప్పుడైనా నాకు “సమైఖ్య “వేడి” తగులుద్దేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *