mt_logo

గులాబీ దళంలోకి వలసల వెల్లువ

-బంగారు తెలంగాణ సాధనకు పెరుగుతున్న భాగస్వామ్యం
-పలు జిల్లాల్లో ఇతర పార్టీలను వదులుతున్న ఎమ్మెల్యేలు
-కేసీఆర్ సమక్షంలో నేడు పార్టీలో చేరనున్న ఇద్దరు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు
-గ్రేటర్ హైదరాబాద్‌లోనూ బలోపేతమవుతున్న గులాబీదళం
-జీహెచ్‌ఎంసీపై జెండా ఎగురవేద్దాం: హోంమంత్రి నాయిని
-భారీగా టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ శ్రేణులు
-గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ
బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు పెరుగుతున్నారు. ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచినా.. సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలంటే ఇంటి పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలనే నిర్ణయానికొస్తున్నారు. ఒక్కొక్కరుగా.. పార్టీలకతీతంగా గులాబీ నీడన చేరుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పలు పార్టీల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ కండువాను కప్పుకోగా… తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం కారు ఎక్కనున్నారు. దీంతో శాసనసభలో అధికార పార్టీ అనూహ్యంగా పెరుగుతుంటే.. మరోవైపు ఇతర పార్టీల శిబిరాలు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ప్రతిపక్ష పార్టీ క్యాడర్ ఉత్సాహంగా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో రాజధాని నగరంలోనూ గులాబీదళం బలోపేతమవుతుంది. గ్రేటర్ ఎన్నికల ముందు ఈ వలసలు భారీఎత్తున కొనసాగుతుండటంతో ఇతర పార్టీల్లో గ్రేటర్ ఎన్నికలపై ఇప్పటినుంచే బెంగ మొదలైంది.

ముఖ్యంగా శాసనసభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ బంగారు తెలంగాణ నిర్మాణంలో కలిసి వచ్చేందుకు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు సైతం గులాబీ పార్టీకి బాసటగా నిలుస్తున్నారు. దీంతో కాంగ్రెస్, టీడీపీలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత రెండు నెలలుగా టీఆర్‌ఎస్‌లోకి వలసలను పరిశీలిస్తే.. కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రాతినిథ్యం కరవయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పది స్థానాలకుగాను ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన మూడింటిలో రెండు బీఎస్పీ పరంకాగా, మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటై.. కేసీఆర్ విజన్‌ను ప్రకటించడంతో అందుకు ఆకర్షితులై… నిర్మల్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప (బీఎస్పీ), ముదోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (కాంగ్రెస్) ఇప్పటికే టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో సాంకేతికంగా కాకున్నా… ఆదిలాబాద్ జిల్లాలో ఇతర పార్టీలకు స్థానం లేకుండా పోయింది. మెదక్ జిల్లాలో 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పోటీచేసిన రెండు స్థానాల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన ఇద్దరు నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోకి రావడం విశేషం.

మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్‌కు ప్రత్యర్థిగా నిలిచిన సీహెచ్ నరేంద్రనాథ్, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు మాజీ మంత్రి, ప్రస్తుతం మెదక్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సునీతాలకా్ష్మరెడ్డి ముఖ్య అనుచరుడు బాల్‌రెడ్డి హస్తాన్ని వదిలిరావడం, ఆయనతో పాటు జిన్నారం ఎంపీపీ రవీందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లోకి రావడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. గేటర్ హైదరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కార్మిక నేత, మాజీ మంత్రి పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి, ఆమెతో పాటు భారీఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి రావడం సరికొత్త ఊపును తెచ్చింది.

నేడు టీఆర్‌ఎస్‌లోకి కనకయ్య, బాణోత్ మదన్‌లాల్
ప్రస్తుతం ఖమ్మం జిల్లా వంతు వచ్చినట్లనిపిస్తుంది. ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు గులాబీ జెండానీడన వచ్చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం తమ పార్టీలకు రాజీనామా చేశారు. సోమవారం వారిద్దరు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లాలో పది స్థానాలకుగాను టీఆర్‌ఎస్ బలం మూడుకు పెరిగినట్లయింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ ఆదివారం తమతమ పార్టీలకు రాజీనామా చేసి.. తమ అనుయాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తప్ప, ఇతర పార్టీలకు మనుగడలేదని నిర్ధారణకు వచ్చిన తరువాతనే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్ నచ్చిందని, అందుకే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానని ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టంచేశారు. సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో తనతోపాటు గార్ల, కామేపల్లి జెడ్పీటీసీ సభ్యులు ఎద్దు మాధవి, మేకల మల్లిబాబుయాదవ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రకటించారు. కామేపల్లి ఎంపీపీ మాలోత్ సరిరాంనాయక్, బయ్యారం ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, బయ్యారం వైస్ ఎంపీపీ మూల మధుకర్‌రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకొంటారన్నారు. ఇప్పటికే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి, టీడీపీలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావుతోపాటు జడ్పీ చైర్‌పర్సన్ కవిత, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కే కోటేశ్వరరావు, మరో ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు అండగా నిలబడుదాం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశయ సాధనకు అండగా నిలవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దడానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఖైరతాబాద్ పార్టీ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ రాములు నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమటి సత్యనారాయణ, సీనియర్ నాయకులు గంగుల రవీందర్‌రెడ్డి, శ్యాంకుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్‌పై గులాబీ జెండాను ఎగుర వేసి సమైక్య పార్టీలకు స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ రాములు నాయక్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీతో తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. ఈ ర్యాలీని ఖైరతాబాద్ మైసమ్మ దేవాలయం వద్ద రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, శ్యాంకుమార్, యాదగిరిరావు, శ్రీరాంగౌడ్, సత్యనారాయణగౌడ్, రాజాగౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *