mt_logo

సచివాలయం కేంద్రంగా టీ ఉద్యోగుల గ్రీవెన్స్ సెల్

తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ కేంద్రంగా బుధవారం నుండి ఈ గ్రీవెన్స్ సెల్ నడవనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో తోడ్పడనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీవెన్స్ సెల్ కు సంబంధించి కొన్ని ఖచ్చితమైన మార్గదర్శకాలు సూచించారు. ఉద్యోగులు తమ పూర్తి వివరాలు, తాము పనిచేస్తున్న శాఖ, కేటాయింపు విధానం లాంటి పూర్తి సమాచారం గ్రీవెన్స్ సెల్ కు అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమకు అందిన విజ్ఞాపనలకు స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని వారు కోరగానే కేసీఆర్ తక్షణమే స్పందించి అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రకు బదిలీ అయిన తెలంగాణ ఉద్యోగులు తమ వివరాలను టీ ఎన్జీవో కార్యాలయంలో ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన వార్ రూమ్ కు 18, 750 మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కలిసి సీఎం కేసీఆర్ తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే వాటిని వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేసే విధంగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినందున ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *