mt_logo

గ్రిడ్ కనెక్టివిటీ లేకే విద్యుత్ కష్టాలు – సీఎం

నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడంతోనే కరెంట్ ఇబ్బందులు ఏర్పడ్డాయని, రాయచూర్ నుండి షోలాపూర్ లైన్లో స్లాట్ కొనమని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పామని, కానీ పట్టించుకోకపోవడంతో ఆ స్లాట్ ను తమిళనాడు కొనుక్కుందని సీఎం కేసీఆర్ చెప్పారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎప్పుడూ నిబంధనలు పాటించలేదని, ఎప్పుడూ కూడా శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం లేదని, కొన్ని సందర్భాల్లో 762 అడుగులకు కూడా నీటిమట్టం పడిపోయిందని, క్షణక్షణం విద్యుత్ సరఫరాపై రికార్డు అవుతూనే ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అయ్యిందని, అప్పుడే అద్భుతాలు చేయమంటే ఎలా అని సీఎం ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఛత్తీస్ గడ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ 36 నెలల్లో వస్తుందని, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల ఉత్పత్తి కోసం పనులు జరుగుతున్నాయని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్తామని, రాజకీయాలకతీతంగా కలిసి రాష్ట్రంగా ముందుకెళ్ళాలని సీఎం కోరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ సమస్య ఉన్నది వాస్తవమేనని, రాజకీయ పక్షాలు, విపక్షాలు అన్న బేధం లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యుత్ సమస్య మరింత తీవ్రతరం కావడానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా కారణమని, రెండు రాష్ట్రాలకు విద్యుత్ వాటా విషయంలో చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని జానారెడ్డి పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతున్నా తెలంగాణ గడ్డమీద పుట్టిన రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వ విధానాలను సమర్ధించడం సరికాదని, తిన్నింటి వాసాలు లెక్కపెట్టొద్దని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *