జాతీయ స్థాయిలో వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన వరంగల్ కు గ్రేటర్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేయమని బుధవారం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం సీఎం కేసీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి ఎంజీ గోపాల్, కమిషనర్ బీ జనార్ధన్ రెడ్డి తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పారిశ్రామిక, విద్యారంగంలో రాష్ట్ర రాజధానికి ధీటుగా వరంగల్ ను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొద్దికాలం క్రితం 42 గ్రామపంచాయితీలను కలపడంతో నగరం చాలా విస్తరించిందని, దీంతో జనాభా 10 లక్షలకు చేరుకుందని అన్నారు. చారిత్రక, పర్యాటక రంగాలకు పేరొందిన వరంగల్ కు గ్రేటర్ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు, వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలతో కూడిన వరంగల్ నగరం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు.