mt_logo

కేసీఆర్ కు అడుగడుగునా నీరాజనం

ఎటుచూసినా గులాబీమయం. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు. తెలంగాణ బోనాలు, బతుకమ్మ సంబరాలు, పటాకుల మోత, పోతురాజుల నృత్యాలు, డప్పులు, ఒంటెలు, గుర్రాలు, లక్షలాది జనం. ఇదీ బుధవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్ లో నెలకొన్న సందడి. ఏ రాజకీయ నాయకుడికీ ఇలాంటి స్వాగతం లభించి ఉండదు. నింగీ, నేలా ఒకటై జననేతకు సాష్టాంగనమస్కారం చేసిందా అన్నట్లు ఉంది. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ అంటూ దారిపొడవునా నినాదాలు. తెలంగాణ పండుగలన్నీ ఒకటే రోజు జరుపుకున్నట్లుగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించింది. తెలంగాణ బిల్లును ఉభయసభల్లో ఆమోదం పొందేలా తీవ్రకృషి చేసి విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో 27 రోజుల తర్వాత అడుగుపెట్టిన పోరాట యోధుడిని లక్షలాది ప్రజలు ఆత్మీయంగా ఆహ్వానించారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 9.30 వరకు భారీర్యాలీ మధ్య కేసీఆర్ జైత్రయాత్ర సాగింది. శంషాబాద్ విమానాశ్రయం నుండి బేగంపేటకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకొన్న గులాబీ బాస్ అక్కడనుండి గన్ పార్క్ వద్దకు ర్యాలీగా బయలుదేరారు. దాదాపు నాలుగుగంటల తర్వాత గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్థూపానికి పూలు, పవిత్ర జలాలతో నివాళి అర్పించారు. తర్వాత తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళ్లి అక్కడ తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడినుండి తన ఇంటికి చేరుకుని కుటుంబసభ్యుల హారతులు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *