mt_logo

హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం

ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత.. బుధవారం నాడు మధ్యాహ్నం తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనీల్, కుమారుడు ఆదిత్య, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీతో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తన నివాసం వద్ద కార్యకర్తలు బాణాసంచ కాల్చి స్వాగతం పలికారు. తన నివాసం వద్ద కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు.

ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ క్రమంలో వారు భావోద్వేగానికి లోనయ్యారు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… నిజం గెలిచిందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కష్టసమయంలో కేసీఆర్‌కు, తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎటువంటి తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను అన్న విశ్వాసం మొదటి నుంచి తనకు ఉందని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రజాక్షేత్రంలో తను కొట్లాడుతూనే ఉంటానని అన్నారు.

“నేను ఏ తప్పూ చేయలేదు. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటనేది తెలుస్తుంది. ఆ రోజు వరకు నా పోరాటం ఆగదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడతా. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటా. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతా అనే నమ్మకం, విశ్వాసం రెండూ నాకు ఉన్నాయి” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు, తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని అన్నారు.