ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్షిప్‌ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా.. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ల జాడేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
బోధనా ఫీజుల బకాయిలు రూ. 5,900 కోట్లకు చేరుకున్నా.. ప్రభుత్వంలో చలనం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ ఏడాది స్కాలర్షిప్‌ల దరఖాస్తులకు కూడా దిక్కులేని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు చదవులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని కేటీఆర్ ప్రశ్నించారు. స్కాలర్షిప్‌లు రాక ఎంతో మంది పేద విద్యార్థులు చదువు వదిలేసి కూలీ పని చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాకపోవటంతో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని చెప్పారు.
స్కాలర్షిప్‌లు పెండింగ్ పెట్టటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే.. అటు కాలేజ్ ఫీజులు అందక యాజమాన్యాలు కూడా విద్యార్థులకు చదువు చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి తలెత్తుతుందని దానికి ఈ కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా పేద విద్యార్థుల తల్లితండ్రులు అప్పులు తెచ్చి పిల్లలను చదవిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడటం మానేయాలన్నారు. వెంటనే భోదన రుసుము బకాయిలు, స్కాలర్ షిప్ లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.