mt_logo

ఆర్టీసీ టీఎంయూ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

శుక్రవారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఎంయూ గౌరవాధ్యక్షుడు హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు మహిళా కండక్టర్లు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. వచ్చే మహిళా దినోత్సవాన్ని రవాణశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ మధ్య జరుపుకుంటామని అన్నారు. మహిళా బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్లు ఉండేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఐఆర్ కోసం టీఎంయూ ప్రధాన కార్యదర్శి నిరవధిక దీక్షకు దిగుతున్నారని, సోమవారం 10 గంటల్లోగా ఐఆర్ పై రాతపూర్వక హామీ ఇవ్వాలని హరీష్ రావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవి కావని, విలీనం విషయంలో టీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు అనడం సరైన పద్దతి కాదని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నేత సుష్మాస్వరాజ్, స్పీకర్ మీరాకుమార్ తెలంగాణ తల్లుల కడుపుకోత అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని వివరించారు. ప్రజల అభిప్రాయం మేరకే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదని, తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. సభలో పాల్గొన్న టీఎంయూ నేతలంతా మహిళలు లేకపోతే అభివృద్ధి లేదని, మహిళా సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *