-కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు ఆద్యుడు
-హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ నిర్మాత
-ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనతో వెలుగు చూసిన ఆణిముత్యం
ఎవరీ ఎస్‌కే డే….? ఇటీవల ఎన్‌ఐఆర్డీలో రాష్ట్ర ఉన్నతాధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జరిపిన కీలక సమావేశం అనంతరం ఈ విషయం మీద పలువురికి ఆసక్తి రేకెత్తింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి అనర్ఘళంగా చేసిన స్ఫూర్తిదాయక ఉపన్యాసంలో ఎస్‌కే డే గురించి దాదాపు ఆరేడు నిమిషాల పాటు అధికారులకు వివరించారు.
దేశంలో పంచాయత్ రాజ్ ఉద్యమానికి ఆద్యుడుగా భావించే ఎస్‌కే డేను అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆ సందర్భంగా అన్నారు. ఐవన్ హోవర్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఆ దేశ గ్రామీణ మంత్రిత్వశాఖలో పనిచేస్తున్న ఎస్‌కే డే ను పండిట్ నెహ్రూ దేశానికి ఆహ్వానించడం, ఆయన ప్రణాళికా విధానాలను మార్చాలని నెహ్రూకు సలహా ఇవ్వడం, తర్వాత దేశానికి వచ్చి నెహ్రూ మంత్రి వర్గంలో సామాజికాభివృద్ధి మంత్రిగా పదవి చేపట్టి హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటు చేయడం తదితర విషయాలను కేసీఆర్ అధికారులకు వివరించారు. గ్రామ స్వరాజ్యమే భారతదేశ స్వరాజ్యమని చాటిచెప్పిన ఎస్‌కే డే దేశంలో పంచాయత్ రాజ్ సృష్టికి అందించిన చేయూతను కూడా సీఎం వివరించారు. ఒక ఉద్యమంగా మొదలైన పంచాయత్ రాజ్ చివరికి రాజకీయం చేయబడి, శాఖగా కుదించబడిన (పొలిటికలైజ్‌డ్, మార్జినలైజ్‌డ్, డిపార్ట్‌మెంటలైజ్‌డ్) పరిణామాన్ని కూడా ఆయన వివరించారు. ఈ వివరణ అంతా ఎస్‌కే డే పై ఇతర వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తిని అందరిలో రేకెత్తించాయి.
అధికారుల ఉరుకులు..పరుగులు
డే సంస్కరణలు, ఆలోచనలు, సిద్ధాంతాలు , ప్రయోగాలు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఆ వివరాలకోసం అధికారులు పరుగులు తీస్తున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ (ఎన్‌ఐఆర్డీ), ఆపార్డ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన, ప్రామాణికమైన సంస్థలకు ఆధ్యుడైన డే గురించిన సమాచారం ఎన్‌ఐఆర్డీలో లభించలేదు. డే మార్గదర్శకాలను, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణలో సమగ్ర గ్రామపంచాయతీ వ్యవస్థ రూపకల్పనకు ప్రణాళికలను రూపొందించాలనేది కేసీఆర్ ప్రయత్నం. ఆపార్డ్ అధికారులు ఆయన బయోగ్రఫీని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తూర్పు బెంగాల్‌లో జననం..
స్వాతంత్య్రానంతర భారతదేశంలో తొలి కేంద్ర పంచాయతీరాజ్ సహకార శాఖ మంత్రి ఎస్.కే.డే. దేశంలో పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు మార్గదర్శి. ప్రజాస్వామ్య ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నప్పుడే ప్రజాస్వామ్యపు ఔన్నత్యం తేటతెల్లం అవుతుందనేది ఎస్‌కే డే ఆలోచన. ఆయన 1905 సెప్టెంబర్ 5న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని(నాటి తూర్పు బెంగాల్) లక్ష్మీబస్సా గ్రామంలో జన్మించారు. ఉన్నత విద్యకోసం అమెరికాలోని మిచిగాన్ పర్‌డ్యూ యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రసిద్ధ వర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రధాని నెహ్రూ పిలుపుతో భారత్‌కు వచ్చిన డే తొలుత పునరావాస మంత్రిత్వ శాఖలో సాంకేతిక సలహాదారుగా పనిచేసి నెహ్రూతో సామాజిక ఇంజినీర్‌గా ప్రసంశలు పొందారు.
మంత్రి పదవి…
గ్రామీణాభివృద్ధిపై, పునాది నుంచి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్న ఆయన ఆకాంక్షలను గుర్తించిన నెహ్రూ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర పంచాయత్ రాజ్ సహకార శాఖ మంత్రి పదవి ఇచ్చారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పథకం చేపట్టి ఉత్తరప్రదేశ్‌లోని ఈత్వా గ్రామంలో మొట్టమొదటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును 1948లో చేపట్టారు. 1952 నుంచి 1955 వరకు ఈ ప్రాజెక్టులకు విస్తృత ప్రాధాన్యం లభించింది.
ఈ 1952లో హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్డీ, ఆపార్డ్ సంస్థలను ఏర్పాటు చేశారు. ఆయన ఈ సందర్భంగానే రాష్ట్రంలో కొంత కాలం గడిపారు. ఎన్‌ఐఆర్డీ స్థాపించిన సమమయంలో సంస్థ ప్రాంగణంలో మామిడి మొక్కను నాటి నీళ్లు పొస్తున్న ఫోటో ఒక్కటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. 1949లో వ్యవసాయానికి అనుగుణంగా ఉండే కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందుకనుగుణంగా 1950లో హర్యానాలోని నీలోఖేరిలో మజ్దూరి మంజిల్ పేరుతో ఒక నూతన కార్యాచరణను అమలు చేశారు. హర్యానా గ్రామీణ వికాసానికి ఆర్థిక పరిపుష్ఠికి ఈ కార్యాచరణ దోహదం చేసింది.
పంచాయత్‌రాజ్ రూపకల్పనలో..
దేశంలోని గ్రామీణ పంచాయత్‌రాజ్ వ్యవస్థను సుసంపన్నం చేసేందుకు 1957లో నెహ్రూ ప్రభుత్వం ఏర్పరచిన బల్వంతరాయ్ మెహతా కమిటీలో ఈయన సభ్యుడిగా కొనసాగారు. అప్పటి దేశంలోని 2,13,300 పంచాయతీల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పంచాయతీరాజ్‌లలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి విలువైన సూచనలను డే చేశారు. జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. కురుక్షేత్ర అనే మాసపత్రికను నడిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నడిపిన ఈ పత్రికకు జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలు లభించాయి.
సామాజిక శాస్త్రవేత్తలు, గ్రామీణాభివృద్ధి అధికారులు, రాజకీయ నేతలు ఈ పత్రికల్లో వ్యాసాలు రాసి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రోత్సహించారు. 1962లో పార్లమెంటు ఎన్నికల్లో రాజస్థాన్‌లోని నాగౌర్ నుంచి ఎన్నికయ్యారు. 1989లో ఆయన కన్నుమూశారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..