హైదరాబాద్ పై గవర్నర్ అధికారాలకు వ్యతిరేకంగా లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. హైదరాబాద్ మాది, గవర్నర్ పెత్తనం ఏమిటి? అనే నినాదాలతో లోక్ సభ మార్మోగిపోయింది. ఎంపీలంతా కలిసి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఎంపీల ఆందోళనపై స్పందించిన కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు జీరో అవర్ లో చర్చిద్దామని పేర్కొన్నారు.
హైదరాబాద్ పై గవర్నర్ అధికారాల విషయంలో హోంమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. హైదరాబాద్ పై గవర్నర్ అధికారాల నిర్ణయం తమది కాదని, యూపీఏ ప్రభుత్వానిదే అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉంచాలన్నదే తమ లక్ష్యమని, తెలంగాణ కేబినెట్ అభిప్రాయం మేరకే గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని, గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను హరించే ప్రయత్నం చేయడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని హోంమంత్రి చెప్పారు.
హోంమంత్రి ఇలా చెప్పడంపై టీఆర్ఎస్ ఎంపీలు ఫైర్ అయ్యారు. అమరుల త్యాగంతో ఏర్పడ్డ తెలంగాణను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తుందని, కేంద్రం కావాలనే తెలంగాణకు సమస్యలు సృష్టిస్తోందని, కేంద్రం పంపిన లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో లోక్ సభ దద్దరిల్లింది. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
అనంతరం కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యి తెలంగాణకు పంపిన లేఖలో సెక్షన్ 8 అతిక్రమించే విధంగా నిబంధనలు ఉన్నాయని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పోలీసు బదిలీల అధికారం గవర్నర్ కు ఇవ్వాలని చట్టంలో లేదని వివరించారు. దీంతో రాష్ట్రానికి పంపిన లేఖలోని ఆదేశాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. ఈనెల 18న చర్చిద్దామని టీఆర్ఎస్ ఎంపీలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోడీని కూడా కలిసి ఇదే విషయంపై చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.