నేరస్థుల గుండెల్లో రైళ్ళు..

  • February 4, 2019 2:20 pm

తెలంగాణ సర్కార్ ఇకపై అటవీ చట్టంలో మరింత కఠినంగా మార్పులు తేనుంది. కలప స్మగ్లింగ్ కు పాల్పడినా, అటవీ స్థలాలు కబ్జా చేసినా, విలువైన అటవీ సంపద దోచుకున్నా మూడేళ్ళ నుండి పదేళ్ళ వరకు జైలుశిక్ష విధించేలా అటవీ చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. అన్ని కేసులను నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేయాలని, జరిమానా కూడా భారీగా పెంచడమే కాకుండా కేసుతో సంబంధం లేకుండా జైలుకు పంపేలా చర్యలు తీసుకోనున్నారు. చెట్లు నరికితే మూడేళ్ళ జైలు, స్మగ్లింగ్ చేసేందుకు చెట్లు నరికితే ఆరేండ్లు, అటవీ భూమి కబ్జా చేస్తే మూడు నుండి పదేండ్లు జైలుశిక్ష విధించేలా అటవీ చట్టానికి పదును పెట్టనున్నారు.

అటవీ చట్టంలో మార్పులు చేసే అధికారం రాష్ట్రానికి ఉండడంతో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ యాక్ట్ కు సవరణలు చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపచేయాలని సర్కార్ నిర్ణయించింది. నేరస్థులను ప్రాసిక్యూట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అధికారాలను అటవీ అధికారులతో పాటు పోలీస్ అధికారులకు కూడా ఇవ్వనున్నారు. దీంతో నేరగాళ్ళను అరెస్ట్ చేసి అక్రమ కలపను సీజ్ చేసే అధికారం పోలీసులకు కూడా లభిస్తుంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఇటీవల ఒక సమీక్ష నిర్వహించారు. అడవుల నుండి పూచికపుల్ల కూడా బయటకు వెళ్ళడానికి వీలులేదని, అవసరమైతే అటవీ చట్టాలను కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు 1962 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ లో కొన్ని మార్పులు తేనున్నారు.


Connect with us

Videos

MORE