By: ఓడపల్లి క్రాంతి రణదేవ్, 94925860
పునర్నిర్మాణ సందర్భం కాకతీయ వైభవం
వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాకతీయులు కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక చెరువు నిండి అదనంగా వచ్చిన నీటిని మరో చెరువులోకి మళ్లించాలనే ఉద్దేశ్యంతో కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కాలువలు ఒక చెరువు నుంచి వేరొక చెరువును, ఆ చెరువు నుంచి మరో సరస్సును అనుసంధానం చేస్తూ నిర్మించారు. అందుకే వీరి కాలం నాటి చెరువులను గొలుసు కట్ల చెరువులు అని పిలుస్తారు.
మధ్యయుగ కాలంలో దక్షిణ భారతంలోని ఉత్తర ప్రాంతాన్ని పాలించిన వారు కాకతీయులు. నాటి చరిత్రలో వీరి పాలన ఒక మహోజ్వల ఘట్టం. క్రీ.శ 1083 నుంచి క్రీ.శ. 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. క్రీ.శ. 9వ శతాబ్దం ప్రాంతంలో మొదట రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వీరు తెలంగాణ మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. వీరి కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, వత్తి వ్యవస్థలు బలపడ్డాయి. గొలుసు కట్టు చెరువులతో వీరు నీటిని నిల్వ చేసిన విధానమూ, సిరులు పండించిన తీరు ఇప్పటి తరుణంలో ఆదర్శనీయం.
మధ్యయుగ కాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి వ్యవసాయం ముఖ్య ఆదాయ మార్గం. కాబట్టి కాకతీయ రాజులు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ రాజులే కాక వారి సేనానులు, సామంతులు, ఉద్యోగులు, మతాచార్యులు, సంపన్నులు తటాకాలు నిర్మించడంపై అమిత శ్రద్ధ చూపారు. ప్రకృతి సిద్ధంగా వర్షపు రూపంలో వచ్చే నీటిని నిల్వ చేసుకునే లక్ష్యంలో కాకతీయుల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. అయితే, జలాశయాల నిర్మాణాన్ని వర్తక వాణిజ్యం కోణంలోనే కాకతీయులు చూడలేదు. సప్త పుణ్యకార్యాల్లో ముఖ్య కార్యంగా, అశ్వమేధ యాగంతో సమానమైందిగా భావించారు.
కాకతీయ చక్రవర్తులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాలను సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు అని నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి ప్రోలరాజు నుంచి జలాశయాల నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇతడు కేసీయ సముద్రం నిర్మించినట్లు గణపతిదేవుడు వేయించిన మోటుపల్లి స్తంభశాసనం ద్వారా తెలుస్తోంది. రెండవ బేతరాజు అనుమకొండ పట్టణంలో శివపురం పేరుతో తోటను, చెరువును నిర్మించినట్లు మోటుపల్లి శాసనం తెలియజేస్తోంది. గణపతి దేవుడు నెల్లూరు, గంగాపురం, ఎల్లూరు, గణపపురం, ఏకశిలాపురిలలో అనేక చెరువులు నిర్మించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు తవ్వించిన అనేక చెరువుల వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
కాకతీయులు పాలించిన తెలంగాణ ప్రాంతమంతా సముద్ర మట్టానికి వేలాది మీటర్ల ఎత్తులో ఉంది. పైగా వర్షపాతం కూడా తక్కువ. ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల వర్షాల ద్వారా వచ్చిన నీరు వృథాగా పోయి నీటి సమస్య ఏర్పడేది. దీంతో వర్షపు నీటిని నిల్వ చేయాలన్న ఉద్దేశ్యంతో కాకతీయ చక్రవర్తులు చెరువుల నిర్మాణానికి పూనుకున్నారు. వర్షపాతం అధికంగా ఉండే అటవీ ప్రాంతంలో కొండలనే ఆనకట్టలుగా చేసుకొని భారీ జలాశయాలను నిర్మించారు. వాటి కింద మరో చెరువును, దాని కింద మరికొన్ని చెరువులు, కుంటలను నిర్మిస్తూ పోయారు. కాలువల ద్వారా వీటిని అనుసంధానించారు. వర్షకాలంలో జలాశయాల్లోకి చేరిన నీరు వాటిని నింపిన తరువాత ఎక్కువైన నీటిని మత్తడి ద్వారా కింద ఉండే చెరువులు, కుంటల్లోకి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని భారీ జలాశయం రంగయ్య చెరువు. ఇది కష్ణా, గోదావరి రెండు నదుల బేసిన్‌లో ఉన్న ప్రత్యేకమైన జలాశయం. దీనిలోని నీళ్లు రెండు నదుల్లోకి చేరుతాయి. వరంగల్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు సుద్దవాగు (లక్నవరం జలాశయంలోకి నీళ్లను తీసుకొచ్చే ప్రధాన వాగు) ద్వారా కొంత రంగయ్య చెరువులోకి చేరుతుంది. చెరువు నిండిన తరువాత మిగులు నీళ్లు కుడి, ఎడమ కాల్వల ద్వారా కింద ఉన్న అనేక చెరువులను నింపుకుంటూ వరద నీరు నదుల్లోకి చేరుతుంది. కుడి కాలువ ద్వారా ప్రవహించిన నీరు నల్లబెల్లి మండలంలోని వెంకటపాలెం చెరువు (నల్లబెల్లి) మైసమ్మ చెరువు, దొప్పని చెరువు (శనిగరం), ఎర్రకుంట (రుద్రగూడెం) సహా పదుల సంఖ్యల్లో కుంటలను నింపుతుంది.
అక్కడి నుంచి దుగ్గొండి మండలంలోని చెరువులను, కుంటలను నింపుతూ ఆత్మకూరు మండలం నీరుకుళ్ల చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి శాయంపేట మండలం కొప్పులలోని చలివాగు ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలోకి చేరుతుంది. ఇక ఎడమ కాలువ నీళ్లు కష్ణా నదిలోకి చేరుతాయి. కుడి కాలువ ద్వారా నల్లబెల్లి మండలంలోని మామిండ్ల చెరువు (గుల్లపాడ్), మాదన్నపేట జలాశయం (నర్సంపేట) ద్వారా చెన్నరావుపేట మండలంలో ప్రవేశిస్తున్న మున్నేరులో కలుస్తుంది. మున్నేరు వాగు పాకాల జలాశయం మత్తడి నుంచి ప్రారంభమవుతుంది. ఖానాపూర్, నర్సంపేట, చెన్నరావుపేట, గూడూరు, మానుకోట, బయ్యారం, డోర్నకల్ మండలాల్లో ప్రవహించిన మున్నేరు ఖమ్మం జిల్లాలోకి అక్కడి నుంచి కష్ణా జిల్లాలో చేరి నందిగామ వద్ద కష్ణా నదిలో కలుస్తుంది.
సుమారు 20 వేల చెరువులను కాకతీయులు నిర్మించినట్లు పలువురు పరిశోధకులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 5 వేల చెరువులను మాత్రమే గుర్తించారు. కష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించిన కాకతీయ సామ్రాజ్యంలో నీటి ప్రవాహ దిశ, నిల్వ చేయడానికి అనువుగా ఉన్న పరిస్థితులను గుర్తించి జలాశయాలను నిర్మించారు. పాకాల, రామప్ప, లక్నవరం సరస్సులు కాకతీయులు నిర్మించిన గొప్ప జలాశయాలు. పాకాల సరస్సును జగడాల ముమ్మిడి నాయుడు నిర్మించాడు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లో ఈ సరస్సు ఉంది.
9,600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు కట్ట 30 అడుగుల విస్తీర్ణంతో ఒకటిన్నర కిలోమీటర్ పొడవుతో ఉంది. 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో సరస్సు, అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. తుంగబంధం, సంగెం తూములు నాటి నిర్మాణ నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. 1,878 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వ ఉన్న ఈ జలాశయంలో గరిష్టంగా 3,262 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 35 వేల ఎకరాలకు పాకాల సరస్సు సాగునీటిని, మహబూబాబాద్, నర్సంపేట పట్టణాలకు తాగునీటిని అందిస్తోంది.
కాకతీయులు నిర్మించిన మరో గొప్ప జలాశయం లక్నవరం. ఇది గోవిందరావుపేట మండలంలో ఉంది. దీని నిర్మాణం కోసం కృషి చేసిన సైన్యాధిపతి భార్య లక్కవతి పేరు మీదుగా లక్నవరం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ జలాశయానికి రంగాపూర్, నర్సింహుల, కోట, శ్రీరాంపతి అనే నాలుగు ప్రధాన కాల్వలు ఉన్నాయి. సుమారు పదివేల ఎకరాల వైశాల్యంలో లక్నవరం సరస్సు విస్తరించి ఉంది. సరస్సు మధ్యలో 13 ద్వీపాలున్నాయి. 2,272 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వ ఉన్న జలాశయంలో గరిష్టంగా 3,135 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు.
వరంగల్ జిల్లాలో వెంకటాపురం మండలం పాలంపేట సమీపంలో రామప్ప చెరువు నిర్మించారు. దీనిని గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ.1213లో నిర్మించినట్లు తెలుస్తోంది. 82 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చెరువు విస్తరించి ఉంది. 1,120 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వ ఉన్న ఈ జలాశయంలో గరిష్టంగా 2,913 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా స్థానికంగా ఉండే అవసరాలు, పరిస్థితులు కూడా కాకతీయులు చెరువులు నిర్మించడానికి కారణమయ్యాయి. వరంగల్ జిల్లాలోని గణపురంలో ఉన్న గణపసముద్రం ప్రకృతి అనుకూలతలు లేకున్నా నిర్మితమైన సరస్సు. గణపురం కాకతీయుల కాలంలోని సైనిక శిబిరం.
ఇక్కడి సైనికుల అవసరాలకు కావాల్సిన నీటి కోసం గణపతిదేవుడు ఈ సరస్సు నిర్మించాడు. ఇప్పుడీ సరస్సు వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. పైన చెప్పిన సరస్సులు, చెరువులతోపాటు అనేక ఇతర చెరువులకు కాలువలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా పానుగల్లు సమీపంలోని ఉదయ సముద్రం, ఎరుకవరంలోని ఎరుక సముద్రం, ఖమ్మం జిల్లా మట్టేడు సమీపంలోని మల్ల సముద్రం, బయ్యారం సమీపంలోని బయ్యారం చెరువులను సాగునీటి సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశ్యంతో కాకతీయ రాజులు నిర్మించారు. కాకతీయుల నీటి పారుదల వ్యవస్థలపై రచనలు చేసిన పీవీవీ.శాస్త్రి అనే చరిత్రకారుడి ప్రకారం చెరువుల నిర్వహణ, కొత్త వాటి నిర్మాణం, మరమ్మతుల కోసం, చెరువుల్లో చేరిన బంక మట్టిని తొలగించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. దేవాలయాలు , ట్యాంకులు, భవనాల నిర్మాణాలు ఎక్కువగా మంత్రులు, అధీన నాయకుల ఆధ్వర్యంలో జరిగాయి.
కాగా, క్రీ.శ.1270 నాటి కాల్పక శాసనం కొల్లపాకలోని వంశవర్ధ కాలువను, మల్యాల కాలువలను తెలియజేస్తోంది. అంబదేవ మహారాజు లెంబపాక, తడ్లపాక వద్ద రాయసహస్ర కాలువను, గండపిండె కాలువను తవ్వించినట్లు తెలుస్తోంది. అమరాబాద్ శాసనం కూడా కాకతీయుల కాలం నాటి కాలువల నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతోంది.
బావుల నిర్మాణం
తమ సామ్రాజ్యంలో వ్యవసాయ అవసరాలకు అనేక బావులను తవ్వించారు కాకతీయులు. ఒక్కొక్క బావి ద్వారా 40-50 ఎకరాల భూమిని సేద్యం చేయాలనే లక్ష్యంతో ఈ బావుల నిర్మాణం జరిగింది. కాలువలు, చెరువుల ద్వారా నీరందించలేని ప్రాంతాల్లో ఈ బావులను నిర్మించారు. వ్యవసాయ అవసరాలకే కాకుండా ప్రజల తాగునీటి అవసరాల కోసం కూడా ఈ బావుల నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఓరుగల్లు కోటలో శంగార బావి, అక్కా చెల్లెళ్ల బావులు ఉన్నాయి. ఒక్కొక్క బావి 40 ఎకరాల సేద్యపు భూమికి నీళ్లందిస్తుంది.
ఆనాటి మరికొన్ని సరస్సులు
కేసరి సముద్రం, ఉదయం సముద్రం, ఎరుక సముద్రం, పోసముద్రం, గణప సముద్రం, కామ సముద్రం, నామ సముద్రం, విశ్వనాథ సముద్రం, లక్ష్మీ సముద్రం, ప్రోల సముద్రం, చోడ సముద్రం, బాస సముద్రం, లకుమ సముద్రం, మల్ల సముద్రం, చౌండ సముద్రం, అనుగ సముద్రం, సబ్బి సముద్రం, కుప్ప సముద్రం, రామ సముద్రం, కాట సముద్రం, గౌడ సముద్రం, చింతల సముద్రం, విశ్వనాధ సముద్రం మొదలగునవి కాకతీయులు నిర్మించిన ముఖ్యమైన సరస్సులు.
చెరువులు
భద్రకాళి చెరువు, మందరాజు చెరువు, గుండం చెరువు, గుడ్ల చెరువు, కొమిటిదేవి చెరువు, నాడిగమ్మ చెరువు, కామ్‌రాజు చెరువు, రంగయ చెరువు, లింగగిరి చెరువు, కల్యక చెరువు, ఎర్రం చెరువు, కోలికుడ్ల చెరువు, డుబల చెరువు, చింతల చెరువు, బిక్కిమల్య చెరువు, తైలపదేవి చెరువు, పెనుగంచిప్రోలు చెరువు, ఎనమదుల చెరువు, సమ్మిశెట్టి చెరువు, గంగచీయ చెరువు, జిలుగుబల్లి చెరువు, ఉప్పలపట్టి చెరువు, మిరియాల చెరువు మొదలైనవి ముఖ్యమైన చెరువులు.
కాలువలు
కుచినేని కాలువ, రావిపాడి కాలువ, బొమ్మకంటి కాలువ, తూము కాలువ, ఉత్తమగండ కాలువ, ఉత్తమ కాలువ, తమ్టి కాలువ, మద్ది – మడ్డు కాలువ, లొమ్తలిం కాలువ, కలమరెడ్డి కాలువ, రెడ్డి కాలువ, అలుగు కాలువ, దడ్ల కాలువ, చిమ్మతల కాలువ, వ్రమ్త కాలువ, బప్పిన కాలువలు కాకతీయుల కాలంలో నిర్మింతమైన కొన్ని ముఖ్యమైన కాలువలు.
ఇప్పటికీ ఆ చెరువులే
కాకతీయులు నిర్మించిన నాటి చెరువులు, సరస్సులు, కాలువలే ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు ముఖ్యమైన సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలను తెలంగాణ ప్రాంతంలో వాడుకోగలుగుతున్నామంటే దానికి కారణం కాకతీయులు నిర్మించిన చెరువులు, సరస్సులే. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నీటిపారుదల రంగంలో కాకతీయ చెరువులు కీలక పాత్ర వహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే గోదావరి జలాలను కేసీ కెనాల్ ద్వారా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే కాకతీయులు నిర్మించిన చెరువులే కీలక పాత్ర వహిస్తాయి.
పర్యాటక రంగ అభివృద్ధి
కాకతీయుల నీటి పారుదల సౌకర్యాలు ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివద్ధికి కూడా ఎంతగానో తోడ్పడుతున్నాయి. పాకాల, లక్నవరం, రామప్ప చెరువులు పర్యాటకంగా గణనీయంగా అభివృద్ధి చెందాయి. వీటి చుట్టు పక్కలున్న ఆలయాలు, మేడారం వంటి పుణ్యక్షేత్రాలు కూడా వీటి విశిష్టతలను పెంచడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. లక్నవరం సరస్సులో ఉన్న 13 ద్వీపాలు పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. దీంతో పర్యాటక శాఖ నాలుగేళ్ల క్రితం 48 లక్షల రూపాయలు వెచ్చించి 182 మీటర్ల పొడవున సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించింది. అంతే కాకుండా రూ॥ 3.5 కోట్లు వెచ్చించి అతిథి గహాలను, బోటింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. పాకాలలో కూడా పార్క్‌ను, వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తక్షణ కర్తవ్యం
800 సంవత్సరాల క్రితం నిర్మితమైన అనేక చెరువులు ప్రస్తుతం పూడికతో నిండుకున్నాయి. వీటికి సరైన మరమ్మతులు చేయించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో మరింత సేద్యపు సామర్థ్యాన్ని పెంచొచ్చని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ అనంతరం ఖాళీ అయ్యే చెరువుల్లోకి గోదావరి జలాలను మళ్లించడం ద్వారా రెండవ, మూడవ పంటలకు కూడా నీరందించవచ్చని జలవనరుల సంఘం మాజీ చైర్మన్ విద్యాసాగర్ రావు సూచిస్తున్నారు. సముద్రమట్టానికి 300- 500 మీటర్ల ఎత్తులో ఉన్న తెలంగాణ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతి తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. కంతనపల్లి, ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఈ చెరువుల్లోకి పంపింగ్ చేయవచ్చని విద్యాసాగర్ రావు ప్రణాళికలు రూపొందించారు.
వరంగల్ ఎన్‌ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డా॥ పాండురంగారావు 200 టీఎంసీల గోదావరి జలాలను కాకతీయులు నిర్మించిన చెరువుల ఆధారంగా వినియోగించుకోవచ్చని తన పరిశోధనలో కనుగొన్నారు. దీని ప్రకారం నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరందించే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థ మొత్తం కూడా కాకతీయులు కల్పించిన చెరువులు, సరస్సులు, కాలువలపైనే ఆధారపడి ఉంటుంది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..