తెలంగాణ ఉద్యమనాయకుడిగా కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు యావత్ తెలంగాణ ప్రజానీకానికి నీటిపారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని భావించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోవడం వల్లే కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.
మెదక్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, శాలువాలు, పూలదండలతో డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దని ప్రజలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సింగూరు కింద పూర్తి స్థాయిలో కాలువలను నిర్మిస్తామని, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీష్ రావు వివరించారు.