mt_logo

మంత్రి కేటీఆర్ ఆర్థిక భరోసాతో మెరిసిన పేదింటి విద్యాకుసుమం

రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన సహాయంతో ఉన్నత శిఖరాలకు ఎదిగింది ఓ నిరుపేద విద్యార్థిని. మంత్రి కేటీఆర్ ఆర్థిక అండతో పట్టుదలతో చదివి ఏకంగా ఐదు బహుళజాతి కంపెనీల నుండి జాబ్ ఆఫర్స్ అందుకొని అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన రుద్ర రచన తల్లితండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో జగిత్యాలలోని బాలల సదనంలో పదో తరగతి వరకు చదివింది. అప్పటి కలెక్టర్‌ శరత్‌ సహకారంతో హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో డిప్లొమా చదివి ఈ-సెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించింది. అక్కడి నుంచి వచ్చి కథలాపూర్‌ మండలం తాండ్య్రాలలోని తన అక్క రమ్య ఇంట్లో ఉండగా… రచన ఈసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించిన విషయాన్ని ఆమె బావ శేఖర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. రచనను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో బీటెక్‌ చదివించారు. పట్టుదలతో కష్టపడి చదివిన రచన.. ఐదు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్‌ ఆఫర్‌ లెటర్లు అందుకున్నది. కానీ, తాను ఉద్యోగంలో చేరబోనని, తన తల్లి కోరిక మేరకు కలెక్టర్‌ అవుతానని రచన ధీమా వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా రుద్ర రచనను సోమవారం జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చదువు ఎలా సాగుతుందోనని దిగులు పడ్డానని, కేటీఆర్‌ సార్ స్పందించి నాకు ఉన్నత చదువులు చదివించారని, సార్ చేసిన సహాయం ఫలితమే నేడు ఇన్ని ఉద్యోగ ఆఫర్లని సంతోషం వ్యక్తం చేసింది. కానీ తాను ఏ ఉద్యోగంలో చేరబోనని, తన తల్లి బతికి ఉన్నప్పుడు తనని బాగా చదివి కలెక్టర్ సాధించమని చెప్పేదని, మంత్రి కేటీఆర్‌ భరోసాతో బాగ చదివి కలెక్టర్‌ అయి అమ్మ కల నెరవేరుస్తానని తెలిపింది. తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. కేటీఆర్‌ సార్ పునర్జన్మ ఇచ్చారని ఉద్విగ్నురాలయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *