గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని జల్లులు కురుస్తున్న విషయం తెలిసిందే. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు హైదరాబాదులో సగటున 1.01 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ కు ఫోన్ చేసి అప్రమత్తం చేయడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా నగరంలోని పరిస్థితులను కమిషనర్ సమీక్షించారు.
వర్షం వల్ల దెబ్బ తిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, రోడ్ల మరమ్మత్తు పనులను డిప్యూటీ కమిషనర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని దాన కిషోర్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి పరిస్థితిని చక్కబెట్టాలని, వర్షపు నీరు సులువుగా పోయేలా మాన్ హోల్స్ లో చెత్తను తొలగించాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని దాన కిషోర్ హెచ్చరించారు. మరోవైపు జీహెచ్ఎంసీ విపత్తుల నివారణ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు..