ఆదివారం సారస్వతపరిషత్ హాలులో ప్రొఫెసర్, కాలమిస్ట్ ఘంటా చక్రపాణి రాసిన తెలంగాణ జైత్రయాత్ర పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, విరసం నేత వరవరరావు, నమస్తే తెలంగాణ సీఈవో కట్టా శేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ రమా మెల్కోటే, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, శ్రీధర్ దేశ్ పాండే, విమలక్క, మలుపు ప్రచురణ సంస్థ ప్రతినిధి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక కీలక భూమిక పోషించిందని, సకలజనుల సమ్మె, సహాయనిరాకరణ ఉద్యమం జరిగిన సందర్భాల్లో పత్రిక సంపాదకులు అల్లం నారాయణ, ఘంటా చక్రపాణిలు తమకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమాంధ్రనేతల కుట్రలు కొనసాగుతూనే ఉంటాయని, వారిపట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2019లో తమ పార్టీ అధికారంలో ఉంటుందని, అవసరమైతే ఐదు సంవత్సరాలకు ముందే తమకు అధికారం వస్తుందని చెప్తున్న చంద్రబాబు మాటలు కొట్టిపారెయ్యొద్దని, సీమాంధ్ర వ్యాపారులు, కార్పొరేట్ శక్తులు డిల్లీలో కుట్రలు చేస్తున్నారని హెచ్చరించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షులు సీహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ చక్రపాణి రచనల్లో నిజాయితీ కనిపిస్తుందని, 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం కంటికి కనిపించినట్లు చూపించారని ప్రశంసించారు. సభలో పాల్గొన్న ప్రముఖులందరూ చక్రపాణి రచనలపై పొగడ్తల జల్లు కురిపించారు. అనంతరం చక్రపాణి మాట్లాడుతూ ఘంటాపథం రాయడం తన అదృష్టమని, దీనిని కొనసాగిస్తానని, తనను ఎంతో ప్రోత్సహించిన నమస్తే తెలంగాణ పత్రికకు, ఎడిటర్ అల్లం నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
