ఆర్ధిక శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా బారిన పడ్డట్లు శనివారం తన ట్విట్టర్ అక్కౌంట్ లో వెల్లడించారు. కరోనా వైరస్ వల్ల వచ్చే లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకున్నానని, ఆ పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు ఖచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. తనతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఐసోలేషన్ లో ఉండాలని, కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.
హరీష్ రావుకు కరోనా సోకడంపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘గెట్ వెల్ సూన్ బావ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇతరుల కంటే మీరు వేగంగా కోలుకుంటారనే నమ్మకం ఉందని, కోవిడ్ నుండి మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హరీష్ రావు అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ హరీష్ రావు త్వరగా కోలుకోవాలని, అందుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.