mt_logo

త్వరలో పేదలకు 85 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..

హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా పూర్తయ్యేలా చేస్తామని, అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రజల స్పందనను వారిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు అందుతాయని, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, చెరువుల అభివృద్ధి, సుందరీకరణ విషయంలోనూ సాగునీటి శాఖతో కలిసి ముందుకు పోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గత ఐదు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యేలు కేటీఆర్ కు వివరించారు. లాక్డౌన్ సమయంలో పెద్ద ఎత్తున రోడ్లను విస్తరించడం, అనేక నిర్మాణాలు చేయడం వల్ల మంచి పేరు వచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా కరోనా రోగుల కోసం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అంబులెన్స్ కొనుగోలు కోసం రూ. 20.50 లక్షల చెక్కును ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ కు ఇవ్వగా ఎమ్మెల్యే గాంధీని కేటీఆర్ అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *