చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ జనరల్‌గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, సస్టెయినబుల్ మొబిలిటీ, ఎంఎస్‌ఎంఈ, స్కిల్లింగ్ తదితర ప్రాధాన్య రంగాల్లో జర్మనీ, తెలంగాణ మధ్య సహకారాన్ని బలోపేతం చేసే విషయంపై ఇరువురు చర్చించారు. జీవశాస్త్రం, ఫార్మా రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని, ఔషధాల ఎగుమతి గణనీయంగా ఉన్నట్టు మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని నెలకొల్పుతున్నట్టు, మెడికల్ డివైజెస్ పార్క్‌లో చాలారకాల పరికరాలు తయారవుతున్నాయని చెప్పారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్రాలు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తదితర రంగాల్లోనూ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు.
జర్మనీకి చెందిన పలు కంపెనీలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్ విభాగం ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ హానరరీ కాన్సుల్ అమితా దేశాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నట్టు భేటీ అనంతరం జర్మన్ కాన్సులేట్ ట్విట్టర్‌లో పేర్కొన్నది. ఇది దేశంలోనే ఐదో అతిపెద్ద నగరమని, నైపుణ్యం గల ఉద్యోగులకు ఇక్కడ కొదవలేదని ప్రశంసించింది. ముఖ్యంగా జీవశాస్త్ర రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించిన నగరమని, వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రఖ్యాతిగాంచిందని కొనియాడింది. మంత్రి కేటీఆర్‌తో జర్మనీ కాన్సులేట్ జనరల్ జరిపిన చర్చలు ఫలప్రదమైనట్టు పేర్కొన్నది. అంతకుముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోనూ జర్మనీ కాన్సులేట్ జనరల్ మైఖేలా కుచ్లర్ భేటీ అయ్యారు.