మెదక్ జిల్లా గజ్వేల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సిరెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ నేతలు కేకే, హరీష్ రావు సమక్షంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, భవిష్యత్ విజన్ లో కేసీఆర్ ను మించినవారు లేరని, ఆయన నాయకత్వంలో గజ్వేల్ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని, అందరి సహకారంతో ముందుకు పోతామని కేశవరావు అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలే ఎజెండాగా గుర్తించిన నర్సిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారని, గజ్వేల్ ను అభివృద్ధిపథంలో నడపడంలో కృషి చేయాలని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో స్థానం లేదని, ఎన్టీఆర్ భవన్ కు ‘టులెట్’ బోర్డు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. 2019 కాదుకదా, 2090 లో కూడా తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదని అన్నారు.
జయప్రకాష్ నారాయణ స్వయంప్రకటిత మేధావి అని, నిజమైన మేధావి అయితే ప్రజల తీర్పును గౌరవించాలని కోరారు. ఓటమిని అంగీకరించలేకే మామీద కేసులున్నాయని అంటున్నాడని, రైతుల కోసం పోరాటం చేసింది తామేనని, జేపీలా ఏసీ రూముల్లో ఉండి రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమమీద కుట్రతోనే అక్రమకేసులు పెట్టిందని, కార్యకర్తల గౌరవం పెరిగేలా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని హరీష్ రావు చెప్పారు.
