‘అమరులకు జోహార్.. వీరులకు జోహార్’ అంటూ తెలంగాణ కళాకారులు కదంతొక్కారు. అమరుల స్వప్నమైన తెలంగాణ సాకారానికి మూకుమ్మడిగా, ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గద్దర్ సారథ్యంలో ‘వేల డప్పులు, లక్ష గొంతులు, ఒకే ఒక్క తెలంగాణ ’ నినాదంతో బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లస్‌లో జరిగిన సమావేశం ఆసాంతం.. తెలంగాణ ఆటపాటలతో మార్మోగింది. వందలమంది కళాకారుల డప్పుల దరువులతో దద్దరిల్లింది. వారి లయ విన్యాసాలతో మురిసిపోయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిధ్వనింపజేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపులేకుండా ఉద్యమిస్తున్న నాయకులు, వివిధ ఉద్యమ సంస్థల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గద్దర్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రజాఫ్రన్ట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
గండదీపంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్, అందెశ్రీ, గోరేటి వెంకన్న, రసమయి బాలకిషన్‌తోపాటు సీనియర్ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘అమరులకు జోహార్.. వీరులకు జోహార్’’ పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ వెంటనే అంశ్రీ ‘జయజయహే తెలంగాణ’ అని గానం చేస్తూ సభను ఉర్రూతలూపారు. ‘పల్లె కన్నీరు పెట్టిందో’ పాటతో గోరేటి వెంకన్న సభికులను కంటతడి పెట్టించారు. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ గూడ అంజయ్య సమావేశానికి పంపిన సందేశాన్ని వేదకుమార్ చదివి వినిపించారు.
తెలంగాణ విద్యావేత్త ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ‘నమస్తే తెలంగాణ’ సంపాదకుడు అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, ‘హన్స్ ఇండియా’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ టంకశాల అశోక్, విశాలాంధ్ర ఎడిటర్ కే శ్రీనివాస్‌రెడ్డి, సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి క్రాంతి, పల్లె రవికుమార్, పీవీ శ్రీనివాస్, రమణ, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ సీ విఠల్, కో చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, రత్నమాల, జేఏ సీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, విద్యార్థి నాయకులు పిడమర్తి రవి, మాదాల భాస్కర్, దుర్గం భాస్కర్ తదితర తెలంగాణ ఉద్యమ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గద్దర్ సభికుల చేత చేయించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాట ప్రతిజ్ఞ కింద ఇస్తున్నాం:
తెలంగాణ నా జన్మభూమి. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు, ఆక్రమణలకు, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో నేను నా శాయశక్తులా పాల్గొంటాను. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణతో ముడిపడిన మా తరతరాల వారసత్వం నేడు ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నది.
స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం ప్రాతిపదికగా ఏర్పడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్మాణానికి నేను కట్టుబడి ఉన్నాను. వేలమంది త్యాగాలతో కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని ప్రాణం ఉన్నంతవరకూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేవరకూ కొనసాగిస్తాను. బలిదానాలను నివారించేందుకు ప్రయత్నిస్తాను. ఐక్య పోరాటం చేసేందుకు కృషి చేస్తాను. భావితరాలకు ఈ స్ఫూర్తిని అందిస్తాను.
తెలంగాణ బిడ్డగా, తెలంగాణవాదిగా ప్రత్యేక రాష్ట్రం సాధించడం నా కర్తవ్యం. నా జన్మహక్కు. సంతోషంగా జీవించేందుకు, దోపిడీకి, అణచివేతకు లోనుగాకుండా ఉండే హక్కును నేను కాపాడుకుంటాను. ప్రత్యేక రాష్ట్రం సాధించిన అనంతరం కూడా ఈ పోరాట స్ఫూర్తిని, చారిత్రక వారసత్వాన్ని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, భావితరాలకు అందించేందుకు త్రికరణశుద్ధిగా కృషి చేస్తాను.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]