రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ ఏర్పాటు పనులకు శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యానిమేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అంశాలను ప్రధానంగా తీసుకుని టీ హబ్ పనిచేస్తుందని, కొత్త ఆలోచనలకు కేంద్రంగా మారుతుందని అన్నారు. ప్రపంచంలో ఎవరు కొత్త స్టార్టప్ సృష్టించినా అది హైదరాబాద్ నుండి ఉండేలా టీ హబ్ ను తీర్చిదిద్దనున్నట్లు, రాష్ట్రంలోని ఐటీ ఇంక్యుబేటర్ లన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకే దీన్ని రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు.
టీ హబ్ కు అవసరమయ్యే మానిటరింగ్ సహకారాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అందిస్తుందని, కొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఐటీ, న్యాయపరమైన సహకారాన్ని నల్సార్ యూనివర్సిటీ అందిస్తాయని మంత్రి చెప్పారు. 2018 నాటికి హైదరాబాద్ దేశంలోనే స్టార్టప్ కేంద్రంగా ఎదుగుతుందని, టీ హబ్ మొదటి దశ పనులు జూన్ 2 లోపు చేపట్టనున్నట్లు, 35 కోట్ల రూపాయలతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటిదశలో చేపట్టే టీ హబ్ ద్వారా 2017 నాటికి 400 స్టార్టప్ లు, 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
మొదటి దశ పనులు పూర్తయ్యేలోపే రెండవ దశ పనులు రాయదుర్గంలో చేపడతామని, ఇందుకోసం కేంద్రం సహకారాన్ని కోరామని, ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి సుజనాచౌదరి చెప్పారన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ పాలసీని ప్రవేశపెడతామని, హైదరాబాద్ అన్ని రకాల స్తబ్ధతలను ఛేదించిందని, నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్ర సీటీవో ఏఎస్ మూర్తి, ఐఎస్ బీ డైరెక్టర్ అజిగ్ రంజేకర్, ఐఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ జే నారాయణన్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా ఫజల్ తదితరులు పాల్గొన్నారు.