mt_logo

దేశంలో తొలిసారిగా ‘బయో మెడికల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్’ తెలంగాణలో : మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానాల పనితీరుపై శనివారం నెలవారీ సమీక్ష నిర్వహించైనా మంత్రి హరీష్ రావు… ఈ సందర్భంగా గైనకాలజీ, ఆర్థోపెడిక్ సేవలు, ఐపీ, ఓపీ, సీ సెక్షన్లు, వైద్య పరికరాల వినియోగం తదితర అంశాల్లో సాధించిన పురోగతిపై మంత్రి ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందులో భాగంగా దవాఖానాలను అన్ని విధాలా బలోపేతం చేస్తున్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో నిధులు ఖ‌ర్చు చేస్తూ ఏర్పాటు చేస్తున్న వైద్య ప‌రిక‌రాల నిర్వహణకు దేశంలోనే తొలిసారిగా ‘బ‌యో మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్’ పేరుతో వైద్య ప‌రిక‌రాల నిర్వహణకు పాలసీని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లోని అన్ని వైద్య పరికరాలు 10 రోజుల్లో ఏఎంసీ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని, అన్ని వైద్య పరికరాల వినియోగం సమర్థవంతంగా జరగాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచడమే లక్ష్యంగా అందరం కలిసి పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రజలకు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలని, సాధారణ ప్రసవాలు పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఏరియా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని, పలు ఆసుపత్రుల్లో సీ-సెక్షన్ల
సంఖ్య గత నెలలో పోల్చితే తగ్గాయన్న మంత్రి.. ఈ మేరకు అధికారులను అభినందించారు.

ఫ్యామిలీ ఆపరేషన్లు చేయాలని, అన్ని ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా లేకుండా చూస్తున్నామన్నారు. ఏ ఆసుపత్రిలో, ఎక్కడ కూడా మందుల కొరత ఉండకూడదని స్పష్టం చేశారు. బయటికి మందులు రాయొద్దని, అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేసవి వేళ ఆసుపత్రుల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వచ్చే నెల సమీక్ష వరకు పని తీరులో మరింత పురోగతి సాధించాలని, వైద్యులు 9 గంటల నుంచి 4 వరకు అందుబాటులో ఉండాలన్నారు.

సర్జరీలు ఎప్పటికపుడు చేయాలని, ప్రభుత్వం డ్రగ్స్, డైట్, శానిటేషన్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిందన్నారు. ఆసుపత్రుల్లో ఆకస్మికంగా సందర్శించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని, మంచి వైద్యాన్ని ప్రజలకు అందించాలనిన్నారు. సమావేశంలో టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్స్, డీసీహెచ్‌ఎస్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *