శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు రావడంతో అధికారులు స్పందించి వెంటనే ఉత్పత్తిని నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి. ఇందులోనుండి 8 మంది సురక్షితంగా రాగా మిగతా తొమ్మిది మంది సిబ్బంది విద్యుత్ కేంద్రంలోనే చిక్కుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల నాగరాజు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఇప్పటివరకు ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మరో నాలుగు మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి జెన్కో దవాఖానకు తరలించారు. తాజాగా మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. అందులో ఒక మృతదేహం ఏఈ మోహన్ దిగా గుర్తించారు.
తాజాగా బయటపడిన మృతదేహాల్లో నాలుగు మృతదేహాల్లో ఒకరిని గుర్తించగా మరో ముగ్గురిని గుర్తించే పనిలో అధికారులు చర్యలు చేపట్టారు. దట్టమైన పొగ కారణంగా మృతదేహాలు నల్లగా మాడిపోవడంతో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెప్తున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులను సంఘటనా స్థలానికి తీసుకొచ్చి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.