mt_logo

ఎవుసం నేర్పే కొత్త బడి

చదువులు, మార్కులు, ర్యాంకుల వెంట పరుగెత్తుతున్న నేటి తరం విద్యార్థులకు తినే తిండి ఎక్కడి నుండి వస్తుంది..దానికి రైతులు ఎంత కష్టపడతారు అనేవి స్వయంగా విద్యార్థులే తెలుసుకునేలా “ఆక్టివ్ ఫామ్ స్కూల్” అనే వినూత్న కార్యక్రమానికి తెరలేపాడు వంశీ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్.

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం గార్లపాడుకు చెందిన వంశీకి చిన్నప్పటి నుండి వ్యవసాయంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. సాప్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాక, స్కూల్ విద్యార్థులకు వ్యవసాయం ఎలా చేస్తారో ప్రాక్టికల్ గా నేర్పించేందుకు 2018 లో గచ్చిబౌలిలోని ఆస్కీలో మూడెకరాల స్థలం లీజుకు తీసుకొని “ఆక్టివ్ ఫామ్ స్కూల్”ను స్థాపించాడు. స్థాపించిన మొదటి ఏడాదే 7వేల విద్యార్థులు వ్యవసాయం ఎలా చేస్తారో నేర్చుకున్నారు. రెండేళ్ల క్రితం ఈ పొలంబడిని రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలో 25 ఎకరాల స్కూల్ క్యాంపస్ గా విస్తరించగా ఇప్పటివరకూ దాదాపు 350 పాఠశాలలకు చెందిన 85వేల మంది విద్యార్థులు ఏ పంటలు ఎలా పండిస్తారో, ఎరువులు ఎలా తయారు చేస్తారో స్వయంగా తెలుసుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులే దున్నటం, విత్తనాలు చల్లటం, నాట్లు వేయడం, వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి పంటకు వేయడం, లాంటివన్నీ చేస్తారు. అంతేకాదు పుస్తకాల్లో ఉండే అనేక పెంపుడు జంతువులు, దాదాపు 55 రకాల పంటల గురించి క్షుణ్ణంగా నేర్చుకుంటారు. ఇందుకు గాను సర్టిఫైడ్ జూనియర్ ఫార్మర్, సర్టిఫైడ్ అర్బన్ ఫార్మర్, సర్టిఫైడ్ నాచురల్ ఫార్మర్ అనే మూడు ప్రత్యేక కోర్సులు నామమాత్రపు ఫీజుతో ఆఫర్ చేస్తోంది ఈ పొలం బడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *