mt_logo

ప్రకృతి ఒడిలో ప్రయాణం..ఫరహాబాద్ ఫారెస్ట్‌

ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం కావాలనుకుంటే సరదాగా విహారానికి వెళ్లాలనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడని వెతక్కోగలం? ఎంతోదూరం కాదు.. ఎంతో సమయం కాదు.. వంద మైళ్లు.. గంట ప్రయాణం చేస్తే చాలు.. పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోతారు. కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిలిచిపోతారు. అవును… ఫరహాబాద్ ఫారెస్ట్‌లో అడుగుపెడితే అలాంటి అనుభూతే సొంతమవుతుంది. తెలంగాణలో అతిపెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్‌లో సఫారీ జర్నీ వెరీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఫరహాబాద్ వ్యూ పాయింట్ కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.

– ఫరహాబాద్ ఫారెస్ట్‌లో సఫారీ జర్నీ
– కట్టిపడేసే అందాలు
– మధురానుభూతులు సొంతం

అతి పెద్ద టైగర్‌జోన్..
తెలంగాణలో అతి పెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్ ఫరహాబాద్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేదారిలో.. సరిగ్గా నగరం నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఫరహాబాద్ ఫారెస్ట్ తారసపడుతుంది. దట్టమైన అటవీ ప్రాంతం. అమ్రాబాద్ అటవిలో మరో భాగమే ఫరహాబాద్. ప్రకృతి అందాలకు నెలవు. రంగు రంగుల పక్షులు, రకరకాల జంతువులు. మైమరిపించే నెమలి నాట్యాలు. లేడి పిల్లల గంతులు, కోయిల కిలకిలా రావాలు.. వీటన్నింటినీ చూడ్డానికి మనసు తహతహలాడుతుంది. కానీ అడవిలో ప్రయాణం మరింత సాహసోపేతంగా సాగాలంటే సొంత వాహనాల్లో కాదు.. జీపుల్లో జర్నీ చేయాల్సిందే.

Forest View from Farahabad View Point Image Source: team-bhp.com

పచ్చని అడవిలో జీపులో ప్రయాణం.. కెమెరా కంటికి నిండైన పండుగ. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫరహాబాద్ ఫారెస్ట్ విజిట్ కోసం ప్రత్యేకంగా సఫారి జర్నీ ఆఫర్ చేస్తోంది. రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో జీపులో దాదాపు 8మంది వరకు ప్రయణించవచ్చు. రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సఫారీ జర్నీకి అవకాశం ఉంటుంది.

ఫరహాబాద్ వ్యూ పాయింట్..
45 నిమిషాల ప్రయాణం. తొమ్మిది కిలోమీటర్లు ప్రయణిస్తే చాలు… అందమైన వ్యూ పాయింట్ కళ్లను కట్టిపడేస్తుంది. మార్గమధ్యంలో జింకలు, కోతుల గుంపులు, నెమలి నాట్యాలు, ఎన్నెన్నో అటవీ జంతువులు, పక్షులు (కొన్నిసార్లు పులులు కూడా) కనిపిస్తాయి. నీటి తావుల చుట్టూ కనిపించే లేడి పిల్లలు, పక్షుల గుంపులను చూడడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక దారి మధ్యలో ఏడోనిజాం విడిది గృహాన్ని చూడవచ్చు.

Farahabad View Point in biggest Tiger Reserve – Image Source: The Hindu

నిజాం వేటకు వచ్చి ఇక్కడే విడిది చేసేవారని చెబుతుంటారు. చారిత్రక విశేషం కలిగిన ఈ అతిథి గృహం శిథిలావస్థలో ఉండడం విషాదం. చివరగా ఫరహాబాద్ వ్యూ పాయింట్ అన్నింటికంటే హైలెట్‌గా చెప్పవచ్చు. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాల్ని చూడ్డం మర్చిపోలేని అనుభూతి. ఎత్తైన కొండమీది చూపు సారించిన దూరం పచ్చని అడవి కనిపిస్తుంది. అటవి మధ్యలో.. బ్రిటీష్ కాలంలో డాక్టర్ రస్సెల్స్ అనే అధికారి తవ్వించిన పెద్ద మానవ నిర్మిత సరస్సు కనిపిస్తుంది.

ఈ సరస్సు నాలుగు హెక్టార్లకుపైగా విస్తరించి ఉండడం గమనార్హం. ఇక్కడ క్యాంటి లివర్ బ్రిడ్జి… టూరిజం ప్లాజా ఉండేవి( ప్రస్తుతం లేవు). ఇన్ని అందాల నడుమ సాగే ప్రయాణాన్ని ముగించాలంటే కూడా మనసంగీకరించదు. అలాంటి అనుభూతుల్ని మీరూ సొంతం చేసుకోవాలనుకుంటే.. మీరూ ఫరహాబాద్‌ని విజిట్ చేయండి మరి. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *