సెక్షన్-8 అనేది చంద్రబాబు చేసే అక్రమాలకు లైసెన్స్ కాదని, ఇక్కడ ఉండి కుట్రలు చేసేందుకు సెక్షన్-8 లేదని ఎంపీ బూరనర్సయ్యగౌడ్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ లో సెక్షన్-8 అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరడంపై ఎంపీ పైవిధంగా అన్నారు. తప్పు చేసినప్పటికే తాను చేయలేదని చంద్రబాబు అంటున్నారని, ఏపీ సర్కారు హైదరాబాద్ నుండి పది సంవత్సరాలు పాలన చేసుకుంటామంటే అంగీకరించామని, ఇక్కడ చంద్రబాబుకు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉండదని, సామాన్య పౌరుడికి వర్తించే చట్టాలే చంద్రబాబుకు వర్తిస్తాయని నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు.
ఈ కేసులో గవర్నర్ పాత్ర ఉంటే మీరు ఎక్కడ ఉండేవారో తెలుసుకోవాలని, ఢిల్లీ రాష్ట్రంలో మంత్రిని జైలుకు పంపిన విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. ఏసీబీ వాళ్ళు ఊరికే కేసులు నమోదు చేయరని, స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు ఇచ్చే సమయంలో పదేపదే మా బాబు, మా బాస్, చంద్రబాబు అని అన్నారని, ఈరోజు టీ స్టాల్ దగ్గరనుండి కల్లు కాంపౌండ్ వరకు ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతుందని బూరనర్సయ్య గౌడ్ అన్నారు.