mt_logo

ఏపీవి అన్నీ తప్పుడు లెక్కలే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా శుక్రవారం నాడు కమల్‌నాథన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్‌శాఖ స్టేట్ క్యాడర్ పోస్టుల జాబితాను వారం క్రితం ఏపీ పోలీసులు కమలనాథన్ కమిటీకి అందజేశారు. వాటిని పరిశీలించిన కమిటీ రెండు రాష్ట్రాలకు 42:58 శాతంలో కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల డీజీపీలతో పాటు రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులెవరైనా 14వ తేదీలోపు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలపాలని, ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తామని కమిటీ కార్యదర్శి ప్రేంచంద్రారెడ్డి తెలిపారు.

ఇదిలావుండగా కమలనాథన్ కమిటీకి ఏపీ పోలీస్ అధికారులు సమర్పించిన లెక్కలన్నీ తప్పేనని తెలంగాణ పోలీస్ అధికారులు విమర్శించారు. డీఎస్పీ పోస్టులతో పాటు అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టుల్లో కూడా భారీ తేడా చూపించారని అన్నారు. అదనపు ఎస్పీ పోస్టులు 146 ఉంటే వాటిని 126గా చూపిస్తున్నారని, నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టులు 53 ఉంటే వాటిని 25గా చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లో సుమారు 965 మంది డీఎస్పీలు ఉండగా కమలనాథన్ కమిటీకి ఇచ్చిన జాబితాలో కేవలం 437 డీఎస్పీలు సివిల్ పోస్టులే ఉన్నట్లు తేలింది. బాబితా తయారీలో పొరపాటు జరిగినా ఐదోపదో తేడా ఉంటుంధి కానీ ఏకంగా 500 పోస్టులు తేడా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీలు అడ్‌హాక్ పదోన్నతులతో ఇష్టం వచ్చినట్లు చేయడం ఇప్పుడు సమస్యగా మారిందని సీనియర్ అధికారులు అంటున్నారు. ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన వారికి పదోన్నతులు కల్పించడంతోనే ఈ సమస్య తలెత్తిందని, 437లోనే 53 ఖాళీలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని, వెయ్యికి దగ్గరలో డీఎస్పీలుంటే కేవలం 384 పోస్టుల్లోనే రెగ్యులరైజ్ అని చెప్పడంపై వారు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *